Telugu States

మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య గొడవ

తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు నేటి నుండి మంజూరు చేయనున్నారు. అర్హులైన పేదలకు రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయింది. 3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను పంపిణీ చేస్తున్నారు. జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం జరుగనుంది. కొత్త రేషన్‌ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్‌ బియ్యం అందజేయనున్నారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య మొదట 4,46,169గా ఉండగా, అన్ని దశల్లో పరిశీలించిన తర్వాత 3,09,083 మందిని అర్హులుగా గుర్తించారు. అధికంగా హైదరాబాద్‌లో 56,064 మందిని అర్హులుగా ఉన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రేషన్ కార్డుల పంపిణీ మొదలైంది.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గొడవ చోటు చేసుకుంది. మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలోంచి రాజగోపాల్ రెడ్డి మైక్ లాగేసుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ శ్రేణులు కూడా ముందుకు రావడంతో తోపులాట జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కి కనీస సమాచారం లేకుండా తన నియోజకవర్గానికి ఎలా వస్తారని మంత్రి జగదీశ్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గం లో ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టడం కాదు, సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నానని ఆయన అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్ తో కొట్లాడి మునుగోడు నిధులు అందించాలని డిమాండ్‌ చేశారు. అలా జరగకుంటే తన నియోజకవర్గంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా ఇలాగే ఉంటుంది అని అన్నారు.

మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ, గత ఆరు దశాబ్దాలుగా ఏమీ చేయలేని కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలను సభ నుంచి బయటకు పంపించారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × one =

Back to top button