తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి నిప్పులు చెరిగారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ అశాంతిని సృష్టించేలా వ్యవహరించారని, ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఉషాబాయి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మునావర్ ఫారూకీ చౌకబారు కామెడీ షో నిర్వహణ వెనక ఉన్న కేటీఆర్ పై పోలీసు అధికారులు వెంటనే పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. కేటీఆర్ వల్లే ఎమ్మెల్యే రాజాసింగ్ జైలులో ఉన్నారని ఆరోపించారు. ఎంఐఎం, ముస్లిం ఓటర్లను బుజ్జగించడం కోసమే హిందూ దేవుళ్లను అవమానించిన ఫారూకీతో కేటీఆర్ షో చేయించారని ఆమె ఆరోపించారు.
మునావర్ ఫరూఖీ తన ప్రదర్శనలో హిందూ దేవుళ్లను అవమానపర్చినందుకు చట్టపరమైన కేసులను ఎదుర్కొంటున్నందున రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారని ఉషా బాబు అన్నారు. దాదాపు 2000 మంది పోలీసు సిబ్బందిని ఆ కార్యక్రమం సజావుగా సాగేందుకు మోహరించారు. ఇంకా చాలా రాష్ట్రాలు అతని ప్రదర్శనను నిలిపివేశాయి. అయితే శాంతియుతంగా ఉన్న హైదరాబాద్‌లో అశాంతిని ప్రేరేపించిన కేటీఆర్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించాలని.. అలా చేస్తే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందని ఆమె ఆన్నారు. ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకునే ఉద్దేశ్యంతో కుట్రతో ఎమ్మెల్యే రాజాసింగ్ ను జైల్లో ఉంచారని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఓటు బ్యాంకు చూసి కేసీఆర్ భయాందోళనకు గురయ్యారని.. ఈ భయాందోళనలో కేసీఆర్ తన కొడుకు, ఒవైసీతో కలిసి ఈ కుట్ర పన్నారన్నారని ఆమె ఆరోపించారు.