Telugu States

రాజా సింగ్ నోట.. రాజీనామా మాట..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలపై ఇటీవలి కాలంలో వరాలజల్లు కురిపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! చాలా నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదని.. ఏవైతే ఉప ఎన్నికలు ఉంటాయో అక్కడ అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తోందనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవలే రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గంపై పెద్ద ఎత్తున వరాలజల్లును కేసీఆర్ కురిపిస్తూ ఉన్నారు. ఈ వరాలజల్లుపై తెలంగాణ గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. గోషామహాల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీమానా చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానని.. గోషామహాల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేల కోట్లు నిధులిస్తే రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గోషామహాల్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తేల్చుకుందామని కేసీఆర్‌ ను రాజా సింగ్ సవాల్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియోజకవర్గానికి నిధులు ప్రకటించిన వెంటనే తాను స్పీకర్ ను కలసి రాజీనామా లేఖ ఇస్తానని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధును ఎలాగైనా అమలు చేస్తామని చెబుతున్న సంగతి తెలిసిందే..! నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. హాలియా, నందికొండ అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. హాలియాలో డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం నిర్మిస్తామన్నారు. దళితబంధు కోసం రూ.లక్ష కోట్లయినా ఖర్చు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 17లక్షల మంది దళితులు ఉన్నారు. వీరిలో దాదాపు 12 లక్షల మంది దళితబంధుకు అర్హులని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి బ్యాంకుతో సంబంధం లేకుండా దళితబంధు కింద రూ.10లక్షలు వేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 కుటుంబాలకు వచ్చేలా చర్యలు చేపడతామని.. ఆరునూరైనా దళితబంధును అమలు చేసి చూపిస్తామన్నారు.

ఈ విషయంపై కూడా రాజా సింగ్ మాట్లాడారు. గోషామహాల్ లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ఓసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు కూడా ఆర్థికంగా బాగుపడతారని రాజా సింగ్ చెప్పుకొచ్చారు. జీహెచ్ఎంసీ నిధులన్నీ ఎంఐఎం కోసమే కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ కు బడుగులు, రైతులపై ప్రేమ వస్తోందని ఎమ్మెల్యే రాజసింగ్ విమర్శలు చేశారు. హుజూరాబాద్‌లో గెలవడానికి ప్యాకేజీలను ప్రకటించారని తమ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ప్యాకేజీలు వస్తాయని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గోషామహాల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం మంచి ప్యాకేజీ ప్రకటించాలని.. రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని రాజా సింగ్‌ వ్యాఖ్యానించారు. గోషామహాల్ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో ఉప ఎన్నిక నిర్ణయిస్తుందని సవాల్ చేశారు రాజా సింగ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 + eight =

Back to top button