జైలు నుండి విడుదలయ్యాక మొదటి ట్వీట్ చేసిన రాజాసింగ్

0
772

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో, ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. మీడియా ముందుకు రాకూడదని, 3 నెలల వరకు సోషల్ మీడియలో వీడియోలు పోస్ట్ చేయకూడదని, జైలు నుంచి విడులయ్యే సమయంలో ర్యాలీలు నిర్వహించకూడదని హైకోర్టు ఆయనకు షరతులు విధించింది. రాజాసింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తొలి ట్వీట్ లో ‘ధర్మం విజయం సాధించింది. మరోసారి మీకు సేవ చేయడానికి వచ్చాను. జై శ్రీరామ్’ అని చెప్పుకొచ్చారు.

దాదాపుగా 75 రోజుల పాటు చర్లపల్లి జైల్లోనే ఉన్న రాజా సింగ్ జైలు నుంచే న్యాయ పోరాటం చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని, తనపై ప్రయోగించిన పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్లపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజా సింగ్ ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలు అధికారులు రాజా సింగ్ ను బుధవారం రాత్రి విడుదల చేశారు. హైకోర్టు షరతుల నేపథ్యంలో ఎలాంటి ర్యాలీ లేకుండానే రాజా సింగ్ ఇంటికి వెళ్లిపోయారు. బీజేపీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.