ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. యూపీలో హిందువులు ప్రశాంతంగా ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని చెప్పారు. బీజేపీకి ఓటు వేయని వారు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని ఆయన హెచ్చరించారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగిందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని, అందరూ కలిసి యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేసి మరోసారి గెలిపించాలని అన్నారు. యోగి మళ్లీ సీఎం కాకూడదని కొందరు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. బీజేపీలో మరో అద్భుత హాస్యనటుడు కన్పించారని కేటీఆర్ సెటైర్లు వేశారు. అందుకు సంబంధించి ట్వీట్ కూడా చేశారు కేటీఆర్. ‘వారు నైతికంగా ఇంతకంటే దిగజారలేరు అని మీరు అనుకున్న సమయంలోనే.. బీజేపీ నుంచి మరో అద్భుతమైన హాస్యనటుడు ఒక్కసారిగా వెలుగులోకి వస్తాడు. మీరు బీజేపీకి ఓటు వేయకపోతే మీ ఇళ్లను యోగి బుల్డోజర్లతో కూల్చేస్తారని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
దీనిపై రాజాసింగ్ మండిపడ్డారు. జోకర్, కమెడియన్ ఎవరన్నది తెలంగాణ ప్రజలకు తెలుసని, అసెంబ్లీలో మాట ఇచ్చి బయట మరచిపోయే వ్యక్తి ఎవరో, అబద్ధాలు ఎవరు చెబుతారో అందరికీ తెలుసని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ లకు పనీపాటా లేదని, జీరో అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యాకొడుకులు కలిసి బీజేపీపై బురదజల్లుతున్నారని విమర్శించారు.