అక్బరుద్దీన్ కేసుల‌ కొట్టివేతపై బండి సంజయ్, రాజా సింగ్ స్పందన ఇదే..!

0
761

మ‌జ్లిస్ నేత‌, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ.. విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఆయ‌న‌పై న‌మోదైన కేసుల‌ను కొట్టివేస్తూ నాంప‌ల్లి కోర్టు బుధ‌వారం నాడు కీల‌క తీర్పు చెప్పింది. ఈ కేసులో అక్బ‌రుద్దీన్‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించింది కోర్టు. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలో 2012 డిసెంబ‌ర్ నెలాఖ‌రులో ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా ప్ర‌సంగించారంటూ అక్బరుద్దీన్ పై కేసులు న‌మోద‌య్యాయి. విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ పోలీసులు ఐపీసీ 120 బీ, 153 ఏ, 295, 188 సెక్షన్ల కింద సుమోటోగా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 2013 జనవరి 8న అరెస్టయిన అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు.

ఈ తీర్పుపై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందించారు. “అక్బ‌రుద్దీన్ కేసులో కోర్టు తీర్పును త‌ప్పుబ‌ట్ట‌డం లేదు. ప్ర‌భుత్వం కావాల‌నే ఆధారాలు స‌మ‌ర్పించ‌లేదు. ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి ఉంటే అప్పీల్‌కు వెళ్లాలి. కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, ఎంఐఎంవి కుమ్మ‌క్కు రాజ‌కీయాలు. మూడు పార్టీల‌కు జ‌నం బుద్ధి చెబుతారు” అంటూ బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. తమకో న్యాయం, ఎంఐఎం వాళ్లకు మరో న్యాయమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తన ట్విట్టర్ అకౌంట్ లో రజినీకాంత్ హీరోగా నటించిన ‘అంధా కానూన్’ సినిమా పోస్టర్ ను షేర్ చేశారు.