క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ శరద్ పవార్ పై విరుచుకుపడ్డ రాజ్ థాకరే

0
714

మే 1.. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే NCP అధినేత శరద్ పవార్‌పై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో విషపూరితమైన కుల రాజకీయాలకు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌ కేంద్ర బిందువయ్యారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ థాకరే మాట్లాడుతూ.. “మహారాష్ట్ర ఎంతో గొప్ప ప్రాంతం.. మహారాష్ట్ర సోషలిజాన్ని దేశానికి ఇచ్చింది, బౌద్ధమతం వ్యాప్తి చెందడానికి సహాయం చేసింది, కమ్యూనిస్టులు కూడా ఇక్కడ ఉన్నారు.. ఎంతో మంది హిందువులు కూడా ఉన్నారు.. కానీ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు ఎంతో దారుణంగా ఉన్నాయి. రాజకీయ నేతలు అసభ్య పదజాలం వాడుతున్నారు.. ఈ ఆదర్శాలను మన పిల్లల ముందు ఉంచబోతున్నామా? శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రజల మనసుల్లో విషం చిమ్మింది. ఈ విషాన్ని స్కూల్, కాలేజీకి వెళ్లే పిల్లలకు కూడా ఇంజెక్ట్ చేస్తారు.” అని ఆరోపించారు. “శరద్ పవార్ ఒక నాస్తికుడు.. నా ప్రసంగం తర్వాత దేవుళ్లను ప్రార్థిస్తూ, పూజలు చేస్తున్నట్లుగా ఆయన ఫోటోలు వైరల్ అయ్యాయి. నాటకాలు చేయవద్దు, నటించవద్దు. నా తండ్రి నాస్తికుడని మీ సొంత కూతురు పార్లమెంటులో చెప్పింది. ఇంకా ఏదైనా ప్రత్యేక రుజువు చూపించాలా?” అని ప్రశ్నించారు.

“శరద్ పవార్ నన్ను మా తాత ప్రబోధంకర్ కేశవ్ సీతారాం థాకరే పుస్తకాలు చదవమని అడిగారు. నేను వాటిని పూర్తిగా చదివాను. మా తాత హిందువు. ఆయన ధర్మానికి వ్యతిరేకం కాదు, ఆ రోజుల్లో అవసరమైన సామాజిక సంస్కరణల కోసం ఆయన ప్రయత్నాలు చేశారు. మా తాత రచనలు ఆ కాలంలో సందర్భానికి తగ్గట్టుగా ఉన్నాయి” అని చెప్పుకొచ్చారు. శరద్ పవార్ మహారాష్ట్రలో చేస్తున్న ఈ కుల రాజకీయాలను సహించబోమన్నారు. “హిందూ పదం అంటే శరద్ పవార్‌కు ఎలర్జీ ఉన్నట్లు తెలుస్తోంది. నేను విమర్శించిన తర్వాతే ఎన్‌సిపి వారు తమ వేదికపై శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పెడుతున్నారు. అంతకు ముందు శివాజీ మహారాజ్ చిత్రాన్ని కూడా వేదికపై ఉంచలేదు. మా మరాఠా సోదరులు, సోదరీమణులను తప్పుదారి పట్టించడానికి శివాజీ పేరును ఎన్సీపీ నాయకులు వాడుకుంటున్నారు” అని రాజ్ థాకరే ఆరోపించారు.