మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలంటూ ఉద్ధవ్ సర్కార్ కు అల్టిమేటం ఇచ్చిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఆయనను పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసేఅవకాశముంది.
MNS చీఫ్ రాజ్ థాకరేపై 2008 కి సంబంధించిన ఒక కేసు ఉంది. దీనికి సంబంధించి సాంగ్లీ జిల్లా షిరాలాలోని మేజిస్ట్రేట్ కోర్టు ఏప్రిల్ 6న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాజ్ థాకరేను అరెస్ట్ చేయాలని ముంబై కమిషనర్ ను కోర్టు ఆదేశించింది. కానీ.. పోలీసులు నిర్లక్ష్యం వహించారు. వారెంట్ జారీ చేసిన తర్వాత కూడా రాజ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. దీంతో పోలీసులు రాజ్ థాక్రే అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అసలు ఏం జరిగిందంటే.. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డులో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని MNS ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రెచ్చగొట్టే ప్రసంగం చేశాడనే ఆరోపణలపై.. కోర్టు ఆదేశాల మేరకు రాజ్ థాక్రేను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ అరెస్ట్ కు వ్యతిరేకిస్తూ.. MNS కార్యకర్తలు నిరసన చేపట్టారు. దుకాణాలను బలవంతంగా మూయించారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. 2008లో రాజ్ ఠాక్రేపై IPC సెక్షన్ 109, 117, 143, ముంబై పోలీస్ యాక్ట్ 135 కింద కేసు నమోదైంది.
MNSపార్టీ చీఫ్ రాజ్ థాకరేతోపాటు మరో 10మందిపై షీరాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు 14ఏళ్లుగా కొనసాగుతోంది. చాలా సార్లు సమన్లు జారీ చేసినా.. రాజ్ థాక్రే ఇన్నేళ్లలో కోర్టుకు ఎప్పుడూ హాజరుకాలేదు. పోలీసుల అభ్యర్థన మేరకు షీరాల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాజ్ థాక్రేను అరెస్టు చేసి సాంగ్లీ కోర్టులో హాజరుపరచాలని ముంబై పోలీస్ కమిషనర్‌ను సాంగ్లీ కోర్టు ఆదేశించింది.
కేసు విచారణలో కోర్టుకు హాజరుకాకపోవడంతో… థాక్రేతోపాటు మరో MNS నాయకుడు శిరీష్ పార్కర్‌పై ముంబై పోలీస్ కమిషనర్, ఖేర్వాడి పోలీస్ స్టేషన్ ద్వారా వారెంట్ జారీ చేశారని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతి పాటిల్ తెలిపారు. జూన్ 8లోపు ఇద్దరు నేతలను అరెస్ట్ చేసి.. కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించిందని ఆమె తెలిపారు
మరోవైపు.. 2012కి ముందు ఉన్న పొలిటికల్ కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ నిబంధన ఉందని MNS కార్యకర్త లు చెబుతున్నారు. అయితే… మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తీసివేయాలని డెడ్ లైన్ విధిండం వల్లే.. పాత కేసును ప్రభుత్వం తిరగతోడుతోందని ఆరోపిస్తున్నారు. రాజ్ థాక్రేను అరెస్ట్ చేయాలన్న కోర్టు నిర్ణయంతో మహారాష్ట్రలో వాతావరణం వేడెక్కింది.