More

  రాజ్ కుంద్రా లీలలు బయటకు వస్తూనే ఉన్నాయి..!

  అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అశ్లీల చిత్రాలను నిర్మించి యాప్‌ల ద్వారా విడుదల చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుండి చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి.

  తనను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన ముంబై పోలీసులకు రాజ్‌కుంద్రా భారీగా లంచం ఇచ్చాడనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. తనను అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు పోలీసులకు ఏకంగా రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారని.. ఈ విషయాన్ని ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవ అలియాస్‌ యశ్‌ ఠాకూర్‌ పోలీసులకు పంపిన ఓ మెయిల్‌లో ఆరోపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవను అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించగా రాజ్‌ కుంద్రా మాదిరి మీరు కూడా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు మార్చిలో ఏసీబీకి పంపిన ఈమెయిల్‌లో తెలిపారు. తాజాగా ఈమెయిల్‌ను ఏసీబీ పోలీస్‌ కమిషనర్‌కు పంపింది. ఈ విషయంపై ముంబై పోలీసులు స్పందించడం లేదు. అంధేరిలోని రాజ్‌కుంద్రా కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అమెరికాకు చెందిన ఫ్లిజ్‌ మూవీస్‌ సంస్థకు సీఈఓగా ఉన్న అరవింద్‌ శ్రీవాత్సవ ఏసీబీకి ఈమెయిల్‌ చేశారు. ఈ సంవత్సరం మార్చిలో ఏసీబీ ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. రూ.4.5 కోట్లు ఉన్న రెండు బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారు. ఇదే కేసులో అప్పట్లో రాజ్‌కుంద్రా అరెస్ట్‌ కాకుండా రూ.25 లక్షలు ఇచ్చారని, మీరు కూడా అంతే మొత్తం ఇస్తే అరెస్ట్‌ చేయమని ఓ పోలీస్‌ రాయబారం చేసినట్లు ఈమెయిల్‌లో అరవింద్‌ తెలిపారు.

  పోర్న్ చిత్రాలను రూపొందిస్తూ ఉన్నారనే ఆరోపణలపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఫిబ్రవరిలోనే కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాజ్‌కుంద్రానే ప్రధాన కుట్రదారుడిగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఇటీవల పోలీసులు తెలిపారు. అశ్లీల చిత్రాల సృష్టి మరియు కొన్ని యాప్స్ ద్వారా విడుదల చేయడం విషయంలో ఫిబ్రవరి 2021 లో ముంబైలో క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసిందని.. ఈ కేసులో రాజ్ కుంద్రాను 19/7/21 న అరెస్టు చేశామని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే తెలిపారు.

  ఈ కేసు గురించి రాజ్‌కుంద్రా లాయ‌ర్ అబ‌ద్ పోండా మాట్లాడుతూ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ యాక్ట్‌లోని 67ఏ సెక్ష‌న్ ను రాజ్‌కుంద్రాపై మోప‌డం స‌రైంది కాద‌న్నారు. ఈ చ‌ట్టం ప్ర‌కారం నిజ‌మైన శృంగార సంభోగ‌మే పోర్న్ అని, మిగితా అంతా వేరే కాంటెంట్‌గా ప‌రిగ‌ణిస్తార‌ని లాయ‌ర్ తెలిపారు. ఐటీ చ‌ట్టాల‌ను.. ఐపీసీ సెక్ష‌న్ల‌తో క‌ల‌ప‌రాదని, కానీ ముంబై పోలీసులు ఆ ప‌నిచేశార‌ని అన్నారు. ఇద్దరి మ‌ధ్య జ‌రిగే శారీర‌క క‌ల‌యిక మాత్ర‌మే పోర్న్‌గా భావించాల‌ని, సంభోగం నిజం కాన‌ప్పుడు దాన్ని నీలి చిత్రంగా భావించ‌రాదని అన్నారు. చ‌ట్టానికి లోబ‌డి రాజ్‌కుంద్రాను అరెస్టు చేయ‌లేద‌ని లాయ‌ర్ పోండా తెలిపారు. మరో వైపు రాజ్‌కుంద్రా మంద‌స్తు బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు.

  Trending Stories

  Related Stories