ఏపీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు

0
708

ఏపీలో ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉంది. వరుణుడు ఇప్పటికే పలు ప్రాంతాలను పలకరిస్తూ ఉన్నాడు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది ప్రస్తుతం కార్ నికోబార్ ప్రాంతానికి పశ్చిమంగా 170 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈ వాయుగుండం రేపటికి తుపానుగా మారే అవకాశముందని తెలిపింది. తుపానుగా మారిన తర్వాత వాయవ్య దిశగా పయనించే క్రమంలో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు తమిళనాడు, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, యానాం ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాయలసీమ జిల్లాలు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఒకట్రెండు చోట్ల ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు.