ఆంధ్రప్రదేశ్‌కు అల్పపీడనం ముప్పు వెంటాడుతోంది. అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. రానున్న 48 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే దిశలో 3 రోజులు ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రల వైపు పయనిస్తుందని భావిస్తున్నారు.
కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నాటికే అల్పపీడనం మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 22వ తేదీ వరకూ ఏపీ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ల రాదని అధికారులు సూచించారు. రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుంది అంటున్నారు.