నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతంలోని హిందూ మహాసముద్రం మీద ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది నవంబర్ 9 నుంచి 11 వరకు వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు కదిలే అవకాశం ఉందని.. దీని కారణంగా రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవారణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రా, యానాంలో నవంబర్ 9, 10న వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
రాయలసీమలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ రెండు రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని.. దక్షిణ కోస్తాంధ్రలో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.