రాహుల్ గాంధీ ఆఫీసుపై దాడి.. వాళ్ల పనేనా..?

0
878

కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ధ్వంసం చేశారు. వంద‌లాది మంది ఎస్‌ఎఫ్‌ఐ నాయ‌కులు జెండాలు పట్టుకుని వచ్చి కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశార‌ని ఇండియన్ యూత్ కాంగ్రెస్ ట్వీట్‌లో ఆరోపించింది.

కేరళలోని అటవీ ప్రాంతాల్లో బఫర్‌ జోన్ల ఏర్పాటు విషయంలో రాహుల్‌ జోక్యం చేసుకోవడం లేదని నిరనసకు దిగిన ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తలు ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడ భద్రత పెంచారు. ఈ దాడికి చెందిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా… కేర‌ళ‌లోని సీపీఎం ప్ర‌భుత్వ‌మే ఈ దాడికి బాధ్య‌త వ‌హించాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

రాహుల్ గాంధీ కార్యాల‌యంపై దాడిని జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళలో సీపీఎం ఆధ్వర్యంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో దాడి జరిగింద‌ని ఆరోపించారు. బఫర్‌ జోన్‌ అంశంపై పోరాడుతున్నట్లుగా వారు చెప్పారని, అయితే దీనితో రాహుల్‌ గాంధీకి సంబంధం ఏమిటో అన్నది అర్థం కావడం లేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం కేరళ సీఎం మాత్రమే.. ఆ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్య‌క‌ర్త‌లు ఏ కారణంతో రాహుల్‌ కార్యాలయంపై దాడి చేశారో అర్థం కావడం లేదన్నారు. సీతారాం ఏచూరి తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై ట్వీట్ చేస్తూ.. వయనాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయాన్ని సీపీఐ విద్యార్థి విభాగం ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ధ్వంసం చేశారని రాసుకోచ్చారు. సీఎం పినరయి విజయన్, సీతారాం ఏచూరి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా? లేదా? అలాంటి ప్రవర్తనను ఖండిస్తారా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి రణదీప్ సూర్జేవాలా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇదేనా సీపీఎం రాజకీయ ఆలోచన? ఇది వ్యవస్థీకృత గూండాల గూండాయిజమని విమ‌ర్శించారు. ఈ ప్రణాళికాబద్ధమైన దాడికి సీపీఎం ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇదిలా ఉంటే… ఈ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాడికి పాల్ప‌డ్డ వారిపై కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

మరోవైపు, వాయనాడ్‌లోని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కార్యాలయంపై జరిగిన దాడిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో తన అభిప్రాయాన్ని, నిరసన తెలిపే హక్కు ఉంది. హింస అనేది తప్పుడు ధోరణి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eleven − 10 =