‘ఓం’ కనిపించకుండా ట్వీట్ చేసిన రాహుల్.. ఎందుకు అంటూ ప్రశ్నలే ప్రశ్నలు..!

టోక్యో పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించినందుకు పారా అథ్లెట్ సుమిత్ ఆంటిల్ని కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్లో అభినందించారు. అయితే ఆయన పోస్టులో సుమిత్ ఆంటిల్ ధరించిన లాకెట్ కనిపించకుండా క్రాప్ చేసి మరీ పోస్టు చేయడం వివాదాస్పదమవుతోంది. ఎంతో మంది నెటిజన్లు ఈ విషయాన్ని గమనించి పలు ప్రశ్నలు సంధించారు. సుమిత్ ఆంటిల్ ధరించిన గొలుసు నుండి ‘ఓం’ ను ఎందుకు కత్తిరించారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తనను కౌల్ దత్తాత్రేయ గోత్రానికి చెందిన ‘జనేయుధారి బ్రాహ్మణుడు’ గా మరియు శివభక్తుడిగా చెప్పుకునే రాహుల్.. ఇప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటూ పలువురు ప్రశ్నించారు.
టోక్యో పారాలింపిక్స్ లో భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు సుమీత్ ఆంటిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఎఫ్64 కేటగిరీలో జావెలిన్ త్రో ఫైనల్లో సుమీత్ ఆంటిల్ స్వర్ణం గెలిచాడు. జావెలిన్ ను 68.55 మీటర్ల దూరం విసిరిన సుమీత్ ఈ క్రమంలో సరికొత్త వరల్డ్ రికార్డు కూడా నమోదు చేశాడు. తన తొలి ప్రయత్నంలో 66.95 మీటర్లు విసిరిన సుమీత్, రెండో ప్రయత్నంలో మరింత మెరుగయ్యాడు. ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి నూతన ప్రపంచ రికార్డు స్థాపించాడు. ఈ పోటీలో ఆస్ట్రేలియాకు చెందిన మైఖేల్ బరియాన్ రజతం సాధించగా, శ్రీలంక పారా అథ్లెట్ దులన్ కొడితువాక్కు కాంస్యం దక్కించుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ సుమీత్ ఆంటిల్ ను అభినందించారు. సుమీత్ రికార్డు విజయంతో దేశం గర్వపడుతోందని తెలిపారు. సుమీత్ భవిష్యత్తులోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. టోక్యో పారాలింపిక్స్ లో భారత అథ్లెట్ల మెరుపులు కొనసాగుతున్నాయని కొనియాడారు.