బ్యాక్ డోర్ వారికి టికెట్లు దక్కవని చెప్పేసిన రాహుల్ గాంధీ

0
764

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటన ముగిసింది. శ‌నివారం మ‌ధ్యాహ్నం గాంధీ భ‌వ‌న్‌కు వ‌చ్చిన రాహుల్ గాంధీ పార్టీ నేత‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. ప‌నిచేసిన వారికే పార్టీ టికెట్లు ద‌క్కుతాయ‌ని, ప‌నిచేయ‌ని వారిని ప‌క్క‌న‌పెట్టేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మెరిట్ ఆధారంగానే పార్టీ టికెట్ల‌ను కేటాయిస్తామ‌ని, ప్ర‌జ‌లు, రైతుల ప‌క్షాన పోరాటం సాగించిన వారికే టికెట్లు ఇస్తామ‌ని అన్నారు. ఈ విష‌యంలో సీనియ‌ర్లు, జూనియ‌ర్లు అన్న తేడాను చూడ‌బోమ‌ని స్పష్టం చేశారు. పార్టీ కోసం ప‌నిచేయ‌ని వారికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టికెట్లు ద‌క్క‌వ‌ని.. హైద‌రాబాద్‌లో కూర్చుని.. ఢిల్లీ చుట్టూ తిరిగితే టికెట్లు రావ‌ని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బ్యాక్ డోర్ ద్వారా టికెట్లు ఆశించే వారు టికెట్ల విష‌యంలో ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేన‌ని.. ఎన్నికల్లో టికెట్ ద‌క్కాలంటే హైద‌రాబాద్‌ను వ‌దిలి గ్రామాల బాట ప‌ట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. టికెట్ల కేటాయింపులో వ్య‌క్తిగ‌తంగా స‌ర్వే చేసిన త‌ర్వాతే నిర్ణ‌యాలు తీసుకుంటామ‌న్నారు.

పార్టీ వ్యవహారాలను నాలుగు గోడల మధ్యే చర్చించాలని, మీడియాతో మాట్లాడే వారు పార్టీకి నష్టం చేసినట్లేనని అన్నారు. ప్రజల్లో ఉండే వారికే టిక్కెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో కూర్చోవద్దని, ఢిల్లీకి అసలే రావొద్దని స్పష్టంగా చెప్పారు. వరంగల్‌ డిక్లరేషన్‌ను రాబోయే 30 రోజుల్లో ప్రతి గ్రామంలోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని, 12 ఏళ్ల కుర్రాడికి కూడా అందులోని అంశాలను వివరించాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా పని చేస్తే పార్టీ విజయం ఖాయమని చెప్పారు రాహుల్‌.