గత వారం యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీని భారతదేశం నుండి తరిమికొట్టాలని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు రాహుల్ గాంధీ చేసుకుంటూ వస్తున్నారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా హౌస్ ఆఫ్ కామన్స్ కాంప్లెక్స్‌లోని గ్రాండ్ కమిటీ రూమ్‌లో ప్రముఖ భారతీయ సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్ లో ప్రజాస్వామ్యం లేదని, ప్రతిపక్షాలపై దాడులు ఎక్కువయ్యాయని తీవ్ర విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు విదేశీ గడ్డపై భారతదేశ పరువు తీశాయని బీజేపీ నాయకురాలు ఆరోపించారు. భోపాల్‌కు చెందిన బీజేపీ ఫైర్‌బ్రాండ్, విదేశీ స్త్రీకి పుట్టిన కొడుకు దేశభక్తుడు కాలేడని ఆనాడు చాణక్యుడు చెప్పాడని అది రాహుల్ గాంధీ నిరూపించారన్నారు. రాహుల్ తల్లి ఇటలీ నుండి వచ్చింది కాబట్టి, వాళ్లు భారతదేశానికి చెందినవారు కాదని తాము భావిస్తున్నామని ఠాకూర్ అన్నారు. విదేశాల్లో కూర్చొని మీకు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం రావడం లేదని అంటున్నారని.. ఇంతకంటే అవమానకరం మరొకటి ఉండదని తెలిపారు. ఆయనకు దేశ రాజకీయాల్లో అవకాశం ఇవ్వకూడదని., దేశం నుంచి తరిమి కొట్టాలని ఠాకూర్ విమర్శలు గుప్పించారు.