ఖర్గే దే విజయం అని ముందే రాహుల్ హింట్ ఇచ్చారా..?

0
775

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడు రానుండడంతో ఇకపై మీరు ఏం చేయబోతున్నారంటూ విలేఖరులు రాహుల్ ను ప్రశ్నించారు. దీనికి ఆయన వెళ్లి ఖర్గేజీని అడగాలని సూచించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలోని కర్నూలు జిల్లా పరిధిలో పాద యాత్ర చేస్తున్న రాహుల్ ప్రెస్ మీట్ పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే ఆయన ఖర్గేని అడగాలని సూచించారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడే పార్టీకి సుప్రీమ్. ప్రతి సభ్యుడు ఆయనకు రిపోర్ట్ చేయాల్సిందే. పార్టీలో నా పాత్ర ఏంటన్నది ఆయన నిర్ణయిస్తారు. దయచేసి ఖర్గేజీ, సోనియా గాంధీజీని అడగండి’’ అంటూ రాహుల్ బదులిచ్చారు. ‘‘ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ లో ఎన్నికల గురించి ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ స్వేచ్ఛా యుతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం పట్ల నేను గర్విస్తున్నాను. బీజేపీ తోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఎన్నికల పట్ల (అధ్యక్ష స్థానానికి) ఆసక్తి చూపించడం లేదు?’’ అని రాహుల్ ప్రశ్నించారు.

ఏపీలో కాంగ్రెస్ ను పునర్నిర్మాణం చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ నెరవేరుస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఏపీకి ఒకే రాజధాని ఉండాలని.. 3 రాజధానుల నిర్ణయం సరైనది కాదని రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారం కోసం ఏపీలో వైసీపీతో కలిసి పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించగా..ఆ విషయంలో నేను నిర్ణయం తీసుకోలేను. పార్టీ అధ్యక్షునిదే తుది నిర్ణయం అని రాహుల్ గాంధీ అన్నారు. గతంలో జరిగిన రాష్ట్ర విభజన గురించి కాకుండా భవిష్యత్ గురించి ఆలోచించాలని రాహుల్ సూచించారు. కాంగ్రెస్‌లో ఉన్నంత ప్రజాస్వామ్యం ఏ పార్టీలోనూ ఉండదని, కాంగ్రెస్‌లో తప్ప ఏ పార్టీలోనూ నేతలు అసంతృప్తి బహిరంగంగా తెలియజేయరని రాహుల్ అన్నారు.