National

రాహుల్ గాంధీ చేస్తున్న తప్పులు.. ఇంస్టాగ్రామ్ కు కూడా చిక్కులే

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిసి చేస్తున్నారో.. తెలియకుండా చేస్తున్నారో ఏమో కానీ సోషల్ మీడియాలో ఆయనకు చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి. తొమ్మిదేళ్ల దళిత బాలిక అత్యాచారం, హత్య ఘటనపై రాహుల్ గాంధీ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశారు. దీనిపై ఫేస్ బుక్ కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సమన్లు జారీ చేసింది. హతురాలి కుటుంబ వివరాలు బయటకు తెలిసేలా వీడియో పెట్టి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. మంగళవారం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఢిల్లీలో జరిగిన ఘటనకు సంబంధించి హతురాలి తల్లిదండ్రులను రాహుల్ ఓదార్చి పొలిటికల్ మైలేజీ కింద వాడుకోవాలని భావించారు. దానికి సంబంధించిన వీడియోను రాహుల్ ట్విట్టర్ తో పాటు ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీనిపై ఇప్పటికే రాహుల్ ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఈరోజే పునరుద్ధరించింది. తాజాగా మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని ఫేస్ బుక్ ను బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది. పోక్సో చట్టం నిబంధనలను ఉల్లంఘించినందుకు రాహుల్ గాంధీ ఇన్ స్టాగ్రామ్ ఖాతాపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫేస్ బుక్ కు ఆదేశాలిచ్చింది. ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇటీవలే ట్విట్టర్ సంస్థ రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లను లాక్ చేసింది. తాజాగా రాహుల్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించింది. దీంతో ఆయన ఖాతాను ట్విట్టర్ అన్‌లాక్‌ చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్ర‌క‌టించింది. రాహుల్‌తో పాటు మరికొందరు పార్టీ నేతల ఖాతాలను కూడా పునరుద్ధరించినట్లు తెలిపింది. ట్విట్ట‌ర్‌లోనైనా తమ ఆలోచ‌న‌లు పంచుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని భావించామ‌ని, అయితే, ఆ సామాజిక మాధ్య‌మం కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఏది చెబితే అదే వింటోంద‌ని రాహుల్ విమ‌ర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ట్విట్ట‌ర్ ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయన ఆరోపించారు.

ఇక ట్విట్ట‌ర్‌ ఇండియా అధిపతిగా ఉన్న మనీశ్‌ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకోగా.. ఇంతలోనే కాంగ్రెస్ నేత‌ల ఖాతాల‌ను అన్‌లాక్ చేశారు. మనీశ్ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేసింది ట్విట్టర్ యాజమాన్యం. ఆయనను అమెరికాలోని తమ ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్టు వెల్లడించింది. భారత ప్రభుత్వం నూతన ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలోనే ట్విట్టర్ ఇండియా చీఫ్ గా మనీశ్ మహేశ్వరి నియమితులయ్యారు. ఇప్పుడు మనీశ్ మహేశ్వరి స్థానంలో భారత్ లో ట్విట్టర్ సారథి ఎవరన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + 3 =

Back to top button