ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరిట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. అంతేకాకుండా రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్ 504 కింద దోషిగా నిర్ధారించి, ఈ సెక్షన్ కింద గరిష్ఠ శిక్షను ఖరారు చేసింది. దొంగలు అందరికీ మోదీ అనే సాధారణ పేరు ఎలా వచ్చింది? అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ 2019లో సూరత్ కోర్టులో నేరపూరిత పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం కోలార్ లో ర్యాలీ సందర్భంగా రాహుల్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా మోదీ కమ్యూనిటీని రాహుల్ గాంధీ అవమానించారు. తాజా విచారణకు రాహుల్ గాంధీ సూరత్ కోర్టుకు హాజరయ్యారు. అయితే రాహుల్ కు బెయిల్ మంజూరు చేశారు. ఈ నిర్ణయాన్ని అప్పీల్ చేయడానికి అతని శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేశారు.
కోర్టు హియరింగ్ కోసం రాహుల్ గాంధీ అంతకుముందు రోజు సూరత్ చేరుకున్నారు. కాంగ్రెస్ గుజరాత్ యూనిట్ అగ్ర నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. రాహుల్ గాంధీకి మద్దతును తెలియజేసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ మద్దతుదారులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీని ‘షేర్-ఎ-హిందుస్థాన్’ అని కీర్తిస్తూ పోస్టర్లు ఉంచారు.