కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. మక్తల్ గుడి బెల్లూరు నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం కర్ణాటకలోని రాయచూర్ ఎర్మాసూర్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం కృష్ణా నదిపైనున్న బ్రిడ్జి నుంచి తెలంగాణలోకి ప్రవేశించనున్నారు. తెలంగాణలో తొలిరోజు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. గుడి బెల్లూరులో పాదయాత్ర ప్రారంభించడంతోపాటు రాహుల్ 10గంటలకు సభలో ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీకి జాతీయ జెండాను అందించి కాంగ్రెస్ శ్రేణులు ఆయన్ను తెలంగాణలోకి స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే.. భారీగా చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
టీపీసీసీతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు రాహుల్ యాత్రకు స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ములుగు ఎమ్మెల్యే ధనసిరి అనసూయ అలియాస్ సీతక్క… రాహుల్ యాత్రకు స్వాగతం చెబుతూ వీడియోను విడుదల చేశారు. ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అన్న వాక్యాలతో మొదలైన సీతక్క వీడియో రాహుల్ గాంధీని శక్తిమంతమైన నేతగా అభివర్ణించారు.
భారత్ జోడో యాత్రకు బ్రేక్:
ఇక దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని.. భారత్ జోడో యాత్రకు మూడురోజులపాటు విరామం ఇవ్వనున్నారు. తెలంగాణలో తొలిరోజు యాత్ర అనంతరం రాహుల్ ఢిల్లీకి పయనం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే 26 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూడా రాహుల్ హాజరుకున్నారు. 24, 25, 26 విరామం అనంతరం 27 నుంచి రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు.