నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. సోమవారం రాహుల్ గాంధీని పదిగంటల పాటు విచారించిన ఈడీ అధికారులు.. మంగళవారం మళ్లీ విచారణకు రావాల్సిందిగా చెప్పారు.
ఈ క్రమంలోనే ఆయన నేడు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు నిన్నటి మాదిరిగానే రాహుల్ గాంధీ, తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి.. ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
రాహుల్ గాంధీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. సోమవారం తరహాలోనే ఈరోజు కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఢిల్లీలోని ఏఐఐసీసీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకొంది. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏఐసీసీ కార్యాలయం వద్ద పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బారికేడ్లపై నుంచి దూకినందుకు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలాతో సహా కాంగ్రెస్ కార్యకర్తలను, కొందరు సీనియర్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీ, అతని తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారణకు పిలిచింది. అయితే సోనియా కరోనాతో చికిత్స పొందుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేదు. రాహుల్ గాంధీ.. సోమవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు రాహుల్ ఈడీ కార్యాలయానికి రాగా.. రాత్రి 11 గంటల వరకు విచారణ సాగింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో రాహుల్ గాంధీ.. సోనియా గాంధీ చికిత్స పొందుతున్న గంగారమ్ ఆస్పత్రికి వెళ్లారు.
నేషనల్ హెరాల్డ్ పత్రిక యంగ్ ఇండియన్ ప్రైవేటు లిమిటెడ్ అధీనంలో ఉంది. దాన్ని ప్రచురించే సంస్థ పేరు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్. ‘యంగ్ ఇండియన్’ కంపెనీకి రాహుల్, సోనియా ప్రమోటర్లుగా ఉన్నారు. అందులో అత్యధిక వాటా వారిదే. ఆ కంపెనీ ఆవిర్భావం, ఏజేఎల్‌కు కాంగ్రెస్ ఇచ్చిన రూ.90.25 కోట్ల రుణం, నేషనల్ హెరాల్డ్‌లో అంతర్గతంగా నిధుల బదిలీ, ఆయన పేరుపై ఉన్న షేర్ల వివరాలు, గత షేర్ హోల్డర్లతో సంబంధాలు.. తదితర అంశాలపై ఈడీ అధికారులు రాహుల్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది.
కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాహుల్ గాంధీ కుటుంబాన్ని వేధిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సోమవారం రాహుల్ ఈడీ వెంట కాంగ్రెస్ నేతలు.. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారు ఏఐసీసీ కార్యాలయం వెలుపల నిరసకు దిగారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు.. పి చిదంబరం, అధిర్ రంజన్ చౌదరి, కెసి వేణుగోపాల్, దీపేందర్ హుడా, జైరాం రమేష్‌లతో సహా పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసులు కాంగ్రెస్ నేతలతో దారుణంగా వ్యవహరించారని సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులను ప్రియాంక గాంధీ పరామర్శించారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌లో నిర్బంధంలో ఉన్న నేతలను పోలీసులు విడుదల చేశారు.