భారత క్రికెట్ జట్టుకి ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లను ఎన్నో రోజులుగా అందిస్తూ వస్తున్నాడు రాహుల్ ద్రావిడ్. గతం అండర్-19 భారత జట్టుకు కోచ్ గా ఉంటూ.. ఎంతో మంది ఆటగాళ్లను భారత క్రికెట్ జట్టుకు ఆడేలా తీర్చి దిద్దాడు రాహుల్ ద్రావిడ్. ఇప్పుడు భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా వెళ్ళబోతూ ఉన్నాడు. ప్రస్తుతం రవిశాస్త్రి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, ఆ తర్వాత ఇంగ్లండ్ లో టెస్ట్ సిరీస్ ఆడనున్న బృందంతో పాటూ వెళ్లడంతో.. శ్రీలంకకు వెళ్లే జట్టుకు ఎవరు కోచ్ గా వెళ్తారా.. అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆ జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరిస్తారంటూ బీసీసీఐ తాజాగా కన్ఫర్మ్ చేసింది.
శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాహుల్ ద్రావిడ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ధృవీకరించారు. కొలంబోలోని ఆర్ ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు మూడు వన్డేలు, మూడు టి 20 మ్యాచ్ లను ఆడనుంది. శ్రీలంక సిరీస్ కోసం రాహుల్ జట్టుకు కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీసీఐ తెలిపింది. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, విక్రమ్ రాథోడ్ లు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టెస్ట్ టీమ్ కు కోచ్ లుగా వ్యవహరిస్తుండడం వల్ల శ్రీలంకతో తలపడే టీమ్ కు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉంటాడని జై షా ప్రకటించాడు. సోమవారం నుండి భారత ఆటగాళ్లు ఏడు రోజుల కఠిన లాక్ డౌన్ లో ఉండనున్నారు. ఆటగాళ్ళు ఇండోర్ ట్రైనింగ్ తీసుకోనున్నారు.
2014 లో ఇంగ్లాండ్ పర్యటనలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేసిన తరువాత టీమిండియాతో వెళ్లడం ద్రవిడ్‌కు ఇది రెండోసారి. భారత జట్టు జూన్ 28 న కొలంబోకు బయలుదేరుతుంది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సన్నాహకంగా భారత జట్టు కొలంబోలో మూడు ఇంట్రా-స్క్వాడ్ ఆటలను ఆడనుంది. పృథ్వీ షాకు ఈ సిరీస్ ద్వారా వన్డే జట్టుకు పిలుపునిచ్చారు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ లు కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, కె గౌతమ్ లను స్పిన్నర్లుగా ఎంపిక చేయగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో ఆకట్టుకున్న యువ స్పీడ్ స్టర్ చేతన్ సకారియా కూడా జట్టులో చోటు సంపాదించాడు.
జులై 13 నుంచి శ్రీలంకతో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం ఈ నెల 28న టీమిండియా ఆటగాళ్లు కొలంబో వెళ్లనున్నారు. అక్కడ జులై 4 వరకు మరోమారు క్వారంటైన్ కానున్నారు. ఆ తర్వాత ఆటగాళ్లంతా రెండు వేర్వేరు జట్లుగా ఏర్పడి ప్రాక్టీసు మ్యాచ్ లు ఆడుతారు. జులై 13, 16, 18న వన్డే మ్యాచ్ లు, 21, 23, 25వ తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరుగనున్నాయి.