కోచ్ గా వచ్చేస్తున్న ద్రావిడ్

0
730

టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తో ముగియనుంది. రవిశాస్త్రి కోచ్ గా కొనసాగే అవకాశాలు లేకపోవడంతో బీసీసీఐ కొత్త కోచ్, ఇతర సహాయక సిబ్బంది కోసం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. టీమిండియా హెడ్ కోచ్ రేసులో అందరికంటే ముందున్న రాహుల్ ద్రావిడ్ కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. భారత జట్టు ప్రధాన కోచ్ గా వచ్చేందుకు ద్రావిడ్ తొలుత ఆసక్తి చూపనప్పటికీ, ఇటీవల దుబాయ్ లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో భేటీ అనంతరం అంగీకరించినట్టు తెలుస్తోంది. టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడేనంటూ ఆ సమయంలోనే కథనాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది యువ క్రికెటర్లను తీర్చిదిద్దిన ద్రావిడ్.. భారత మెయిన్ జట్టుకు కోచ్ అయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.

ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ అధిపతిగా ఉన్న ద్రవిడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడంతో.. ద్రావిడ్ స్థానంలో ఎవరిని నియమించాలా అని క్రికెట్ అడ్వైజరీ కమిటీ తలమునకలైంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జయ్ షాలు ద్రావిడ్ ను కోచ్ గా చేయాలని మొదటి నుండి భావిస్తూ ఉన్నారు. కోచ్ పదవి గడువుకు చివరి రోజు కావడంతో రాహుల్ అధికారికంగా ఈరోజు దరఖాస్తు చేసుకున్నారు. NCAలో అతని బృందం, బౌలింగ్ కోచ్ పరాస్ ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.