టీమిండియా హెడ్ కోచ్ గా ద్రావిడ్.. అద్భుతాలు ఆశిస్తున్న అభిమానులు

0
855

టీమిండియా(మెన్స్ క్రికెట్) హెడ్ కోచ్ గా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ఇటీవలే ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ద్రావిడ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. మరికొన్ని రోజుల పాటూ కోచ్ గా రవి శాస్త్రి ఉండాలనే వాదన ఉన్నా కూడా.. రావిశాస్త్రి కొనసాగడానికి ముందుకు రాలేదు. ఇక రాహుల్ ద్రావిడ్ కోచ్ గా రావాలని చాలా మంది అభిమానులు కూడా ఆశిస్తున్న తరుణంలో ద్రావిడ్ నియామకాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ద్రావిడ్ స్పందిస్తూ రవిశాస్త్రి కోచ్ గా టీమిండియా అద్భుతమైన విజయాలను సాధించిందని.. ఆటగాళ్లందరి సహకారంతో విజయాల పరంపరను తాను కూడా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. రవిశాస్త్రి కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ వరుస విజయాలను సాధించింది.. టెస్టుల్లో అద్భుతమైన విజయాలను అందుకుంది. అది కూడా విదేశాల్లో చిరస్మరణీయమైన విజయాలను అందుకుంది. ఒక్క ఐసీసీ ఈవెంట్స్ లో మాత్రం భారత్ కు అసలు కలిసిరాలేదు. ఇక ద్రావిడ్ కోచ్ గా వస్తే భారత్ మరిన్ని విజయాలను అందుకుంటుందని.. ఐసీసీ టోర్నమెంట్స్ ను కూడా గెలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ నియామకంపై బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ మాట్లాడుతూ, టీమిండియా హెడ్ కోచ్ గా ద్రావిడ్ ను స్వాగతిస్తున్నామని చెప్పారు. సుదీర్ఘమైన ప్లేయింగ్ కెరియర్ ద్రావిడ్ సొంతమని.. క్రికెట్ చరిత్రలోని దిగ్గజాలలో ద్రావిడ్ ఒకరని కొనియాడారు. నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ) హెడ్ గా ద్రావిడ్ అద్భుతమైన సేవలందించారని చెప్పారు. ద్రావిడ్ నేతృత్వంలో ఎందరో యంగ్ ప్లేయర్స్ భారత జట్టుకు ఎంపికై, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అన్నారు. ద్రావిడ్ మార్గదర్శకత్వంలో టీమిండియా ఎన్నో విజయాలను సాధిస్తుందని భారత క్రికెట్ ను ద్రావిడ్ అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తాడనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. ద్రావిడ్ ను కోచ్ గా చేయాలని గంగూలీ ఎప్పటి నుండో ఆశిస్తూ వస్తున్నాడు.