ఏడు దశాబ్దాల క్రితమే బ్రిటిషర్లు దేశాన్ని వదిలివెళ్లినా.. ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు వారి అడుగుజాడల్లోనే పయనిస్తున్నారు. విభజించి పాలించు అనే దుష్టనీతిని ఇంకా ఫాలో అవుతున్నారు. తాజాగా కేరళ పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అంటూ విడదీసి మాట్లాడటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తాజాగా కేరళలోని తన సొంత నియోజకవర్గం వయనాడ్ లో పర్యటించిన రాహుల్ గాంధీ.. కేరళలో ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల తలపెట్టిన ‘ఐశ్వర్య యాత్ర’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని తిరువనంతపురంలో జరిగిన యాత్ర ముగింపు సభలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దక్షిణాదికంటే, ఉత్తరాదిలో రాజకీయాలు విభిన్నంగా వుంటాయని అన్నారు. కేరళకు వస్తే అంతా ఉత్సాహంగా కనిపిస్తుందన్నారు. తాను పదిహేనేళ్లు ఉత్తరాదిన ఎంపీగా వున్నానని.. అక్కడ రాజకీయాలకు కేరళ రాజకీయాలు భిన్నంగా వున్నాయని తెలిపారు. కేరళ తనకు కొత్తగా అనిపిస్తోందని తెలిపారు. ఇక్కడి ప్రజలు సమస్యలపై పూర్తి ఆసక్తి, అవగాహనతో ఉంటారన్నారు. ఇటీవల అమెరికాలో విద్యార్థులతో మాట్లాడినప్పుడు కూడా కేరళకు వెళుతుండటం తనకు ఉత్సాహంగా ఉంటుందని చెప్పినట్లు రాహుల్ గుర్తుచేశారు. అంటే, దక్షిణాదివాళ్లు తెలివైనవాళ్లని.. ఉత్తరాది వాళ్లకు అంత విషయ పరిజ్ఙానం ఉండదని చెప్పకనే చెప్పారు రాహుల్.
రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విభించి మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారని.. పలు ఎన్నికల్లో అమేఠీ నుంచి గెలుపొందిన రాహుల్ ఉత్తరాది ప్రజలను కించపరుస్తున్నారని ట్విటర్ వేదికగా ఆరోపించారు. రాహుల్ కొద్ది రోజుల క్రితం ఈశాన్య ప్రాంతానికి వెళ్లినప్పుడు దేశ పశ్చిమ ప్రాంతంపై విషం చిమ్మారని.. ఇప్పుడు దక్షిణాదికి వెళ్లి ఉత్తరాదిపై అదే పని చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి విభజించి పాలించే రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శించారు. ఉత్తరాది ప్రజలను, అమేథీని కించపరచవద్దని సూచించారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, కిరణ్ రిజిజులు సైతం మండిపడ్డారు. ఇన్నాళ్లూ ఎంపీగా ఆదరించిన ఆమేథీ ప్రజల పట్ల రాహుల్‌కు ఏమాత్రం కృతజ్ఞత లేదని కేంద్ర ధ్వజమెత్తారు. అటు, భారత్ ఒకే దేశమని.. దేశాన్ని, ప్రజల్ని విభజించవద్దని.. విదేశీ వ్యవహారాల శాఖామంత్ిర ఎస్. జైశంకర్ సూచించారు. కేంద్ర మంత్రులు హర్‌దీప్ సింగ్ పూరి, గజేంద్రసింగ్ షెకావత్‌లు కూడా రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.