ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి తనకు ప్రాణ హాని ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన సహచర పార్లమెంటు సభ్యులకు లేఖ రాశారు. 4 పేజీల లేఖలో వైసీపీ నేతలపైనా, ప్రత్యేకించి సీఎం జగన్‌పై ఆయన పలు ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించిన లెటర్ ను రఘురామ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార దుర్వినియోగం చేసి తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన లేఖలో తెలిపారు. తనపై గతంలో ఏపీ ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టిందన్నారు. సీబీసీఐడీ అధికారులతో తనను వేధింపులకు గురిచేశారని రఘురామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు. తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించారని, తాను ఫిర్యాదు చేస్తే తిరిగి తనపైనే కేసులు నమోదు చేశారని ఆయన తెలిపారు.
బుధవారం నాడు..
బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి తనను హత్య చేయడానికి కుట్రపన్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. తన పట్ల పోలీసుల వ్యవహార శైలిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని అన్నారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ పై క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు.