More

    కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు తనయుడు

    తనను పోలీసులు కొట్టారంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..! ఆ గాయాలు.. ఇప్పటివా.. కాదా అని తెలుసుకోవడానికి ఎంపీ రఘురామకృష్ణరాజుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రఘురామ సొరియాసిస్ తో బాధపడుతున్నట్టు గుర్తించారు. డెర్మటాలజీ పరీక్షలు కూడా చేయించారు. ఈ వైద్య పరీక్షలపై నివేదిక కోసం సీఐడీ కోర్టు ప్రత్యేకంగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ మెడికల్ బోర్డుకు జీజీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వం వహిస్తున్నారు.


    అన్ని రకాల వైద్య పరీక్షలు పూర్తయ్యాక రఘురామ కృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కోర్టు ఆయనను రమేశ్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, పోలీసులు జిల్లా జైలుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. రఘురామకు నిర్వహించిన వైద్య పరీక్షలపై మెడికల్ బోర్డు నివేదిక రూపొందించింది. ఈ నివేదికను జిల్లా కోర్టులో సమర్పించారు. రఘురామకు కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు.
    మధ్యాహ్నం 12 గంటల లోపే రఘురామ వైద్యపరీక్షల నివేదిక ఇవ్వాల్సి ఉన్నా చాలా ఆలస్యంగా పనులు జరుగుతూ ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీజీహెచ్ లో వైద్య పరీక్షల అనంతరం, రమేశ్ ఆసుపత్రిలోనూ పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది.

    రఘురామకృష్ణరాజు తనయుడు కనుమూరి భరత్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. పోలీస్ కస్టడీలో తన తండ్రిని చిత్రహింసలకు గురిచేశారని.. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. చట్టాలు, రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించరాదని తన లేఖలో కోరారు. భరత్ తన లేఖతో పాటు రఘురామ కాలి గాయాల ఫొటోలను కూడా జోడించారు. ఏపీలో అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని.. తన తండ్రిని ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్ బృందం ఈ నెల 14న అదుపులోకి తీసుకుందని, విచారణ పేరుతో రాత్రంతా హింసించారన్న భరత్, ఓ ఎంపీ అని కూడా పట్టించుకోకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. పోలీసుల దెబ్బలకు ఆయన శరీరంపై గాయాలు తగిలాయని, సరిగా నడవలేని స్థితిలో ఉన్నారని లేఖలో తెలిపారు. అవి కొట్టడం వల్ల ఏర్పడిన దెబ్బలే అయితే కఠినచర్యలు తప్పవని కోర్టు కూడా పోలీసులను హెచ్చరించిన విషయాన్ని భరత్ తన లేఖలో ప్రస్తావించారు.

    Related Stories