Telugu States

ఏపీకి రాకుండానే వెనక్కు వెళ్ళిపోయిన ఎంపీ రఘురామ..?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే..! ఈ పర్యటనలో పాల్గొంటానని చెబుతూ వస్తున్న నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏపీకి రాకుండానే వెళ్లిపోయారు. మోదీ పర్యటనలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రఘురామరాజు భీమవరం వెళ్లేందుకు గతరాత్రి హైదరాబాద్‌లో రైలెక్కారు. ఆయనకు మద్దతుగా భీమవరంలో ర్యాలీ నిర్వహించిన యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారని.. యువకుల కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రఘురామ కృష్ణంరాజు మధ్యలోనే రైలు దిగి వెళ్లిపోయారు. ప్రొటోకాల్ విషయంలో అధికారులు తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. యువకులపై కేసు పెట్టడం రఘురామను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, అందుకనే ఆయన భీమవరం రాకుండానే రైలు దిగి వెనక్కి వెళ్లిపోయారని ఆయన కార్యాలయం తెలిపింది.

మరో వైపు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో కానీ, వేదికపై ఉండే వారి జాబితాలో కానీ, హెలిప్యాడ్ వద్ద ప్రధానిని ఆహ్వానించే వారి జాబితాలో కానీ రఘురామకృష్ణరాజు పేరు లేదని పేర్కొన్నారు. ప్రధాని కార్యక్రమానికి ఆయన ఎలా వస్తున్నారో తెలియదని, తాము మాత్రం చట్ట ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. రఘురామరాజు ఫోన్ నంబరును పోలీసులు బ్లాక్ లిస్టులో పెట్టలేదని అన్నారు.

Related Articles

Back to top button