Telugu States

కాళ్లకు గాయాలతో రఘురామ.. తాజా గాయాలేనంటున్న లాయర్లు

ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రఘురామ కృష్ణరాజుపై ఐపీసీ 124 (A), 153(A), 505, 124A, 120 (b) of IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బెయిల్ కోసం రఘురామకృష్ణ రాజు హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ డిస్మిస్ చేసింది. బెయిల్ కోసం సిఐడి కోర్టులో ప్రయత్నించమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ పోలీసులపై సీఐడీ కోర్టుకు ఫిర్యాదు చేయడం సంచలనం అయింది. తన కాళ్లకు గాయాలయ్యాయని.. పోలీసులు తనను కొట్టడం వల్లే గాయపడ్డానని రఘురామకృష్ణరాజు సీఐడీ కోర్టు న్యాయమూర్తికి తెలియజేశారు. గత రాత్రి తనను వేధింపులకు గురిచేశారని, అరికాళ్లు వాచిపోయేలా కొట్టారని నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. రఘురామ కృష్ణ రాజు కళ్ళకు అయిన గాయాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఎరుపు రంగులో వారి కాళ్లు ఉండడాన్ని గమనించవచ్చు.
ఏపీ సీఐడీ అధికారులు ఈ సాయంత్రం రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు రిమాండ్ నివేదికను న్యాయమూర్తికి సమర్పించారు. రఘురామకృష్ణరాజు తనకు బెయిల్ మంజూరు చేయాలని ఓ పిటిషన్, అత్యవసర వైద్యసాయం కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామకు తగిలిన గాయాలను చూసి రిమాండ్ నివేదికను పెండింగ్ లో ఉంచింది న్యాయస్థానం. ఆయనను ఆసుపత్రికి తరలించాలని కోరగా.. తాను ప్రభుత్వాసుపత్రికి వెళ్లనని రఘురామ చెప్పారు. దీంతో రమేశ్ ఆసుపత్రికి తరలించాలని న్యాయమూర్తి సూచించారు.
రఘురామ తరపు న్యాయవాదులు.. రఘురామకృష్ణరాజు కాళ్లకు అయిన గాయాలకు సంబంధించిన ఆధారాలను హైకోర్టుకు కూడా సమర్పించారు. ఈ కేసును సీబీఐ లేదా ఎన్ఐఏకి అప్పగించాలని కోరారు. ఎంపీ రఘురామరాజు కాళ్లకు గాయాలు కనిపిస్తున్నాయని ఆయన తరపున లాయర్లు చెప్పగా రాష్ట్రంలో ఏం జరుగుతోందని హైకోర్టు ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. రఘురామకు తగిలినవి తాజా గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది హైకోర్టు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

1 × three =

Back to top button