బాసరలో ర్యాగింగ్ కలకలం నెలకొంది. ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పోలీసులు ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలోని స్థానిక కృష్ణా బాయిస్ హాస్టల్ రూం నంబర్ 228ను పీయూసీ–1 విద్యార్థులకు అధికారులు కేటాయించారు. ఆ గదిలోని కొత్త వస్తువులైన బెడ్ కార్టులు, ట్యూబ్ లైట్లను పీయూసీ–2 సీనియర్ విద్యార్థులు జూనియర్లను బెదిరించి తీసుకెళ్లారు. డైరెక్టర్ సతీశ్‌కుమార్ హాస్టల్ భవనాలు తనిఖీ చేసిన సందర్భంలో ఈ విషయాన్ని జూనియర్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యగా సీనియర్లు ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. ర్యాగింగ్ శృతిమించడంతో బాధిత విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. కళాశాల వార్డెన్ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 323, 506, రాగింగ్ సెక్షన్ 4(1/2/3) ప్రకారం ఐదుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు.