సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై భారత్ 113 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 191 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లలో ఎల్గర్ (77), బవుమా (35), డికాక్ (21) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్లు ఎవరూ రాణించలేదు. బుమ్రా, షమీ చెరో మూడు వికెట్లను తీశారు. సిరాజ్ రెండు వికెట్లను, అశ్విన్ ఆఖరి రెండు వికెట్లను తీయడంతో భారత్ విజయం లాంఛనమైంది. ఆఖర్లో రబడా, ఎంగిడీల వికెట్లను అశ్విన్ వరుస బంతుల్లో తీయడం విశేషం. 68 ఓవర్ల పాటూ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 191 పరుగుల వద్ద సెకండ్ ఇన్నింగ్స్ ను ముగించింది.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ కాగా… సౌతాఫ్రికా 191 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యతను సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్ జొహాన్నెస్ బర్గ్ వేదికగా జనవరి 3 నుండి జరగనుంది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
తొలి టెస్టు ముగిసిన తర్వాత సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ సంచలన ప్రకటన చేశాడు. టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని క్రికెట్ సౌతాఫ్రికా (సీఏ) విడుదల చేసిన ప్రకటనలో ఉంది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం డికాక్ కొనసాగనున్నాడు. ఈ నిర్ణయాన్ని ఎన్నో రోజులు ఆలోచించిన తర్వాతే తీసుకున్నానని డికాక్ తెలిపాడు. కుటుంబమే తనకు అన్నీ అని, తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో భవిష్యత్ గురించి ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పాడు. ఇకపై ఎక్కువ సమయం కుటుంబానికే కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు తనతో కలిసి ప్రయాణించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాయి. డికాక్ ఇప్పటి వరకు 54 టెస్టుల్లో సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. 3300 పరుగులు చేశాడు.