అడ్డదారుల్లో అందలమెక్కాలన్న ఆశ. అడ్డూఅదుపూలేని విస్తరణ కాంక్ష. నాసిరకం వస్తువులతో ప్రపంచాన్ని గార్బేజ్ సెంటర్‌గా మార్చేసి.. ఉగ్రవాద దేశాలకు ఎరవేసి.. సరిహద్దు దేశాలపై ఎగదోసి.. ప్రపంచంపై పట్టు పెంచుకోవాలనే అత్యాశ. మేడిన్ చైనా ఎక్విప్మెంట్తో దొంగచాటుగా సీక్రెట్లన్నీ దోచేసి.. పైచేయి సాధించాలనే దురాశ. సరిహద్దుల్ని చెరిపేసి.. సముద్రంపైనా వలవేసి.. సామ్రాజ్యాన్ని విస్తరించాలనే పేరాశ. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తుంది. ప్రపంచంపై పట్టుకోసం పనికిమాలని పనులన్నీ పకడ్బందీగా చేస్తుంది. ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించో మీకు ఇప్పటికే అర్థమైవుంటుంది. ఎస్.. జిత్తులమారి చైనా.
మాటిమాటికీ కయ్యానికి కాలు దువ్వుతూ.. పొరుగుదేశాలపై అణచివేత, ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న డ్రాగన్‌కు.. భారత్ అడుగడుగునా చెక్ పెడుతూ వస్తోంది. ఈ క్రమంలో కొత్త కూటమి ద్వారా మరోసారి భారత్ గట్టి షాకిచ్చింది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, భారత్ సభ్య దేశాలుగా QUAD పూర్తిస్థాయిలో అవతరించింది. మార్చి 12న జరిగిన తొలి సమావేశం విజయవంతం కావడంతో ఇప్పుడు చైనాకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పటిదాకా అధికారులు, మంత్రుల స్థాయిలో చర్చలు.. ఇప్పుడు అధినేతల నడుమ సాగడంతో QUAD కూటమికి నిండుదనం వచ్చింది. తొలి సమావేశంలోనే నాలుగు దేశాల అధినేతలు తమ విధానమేంటో కుండబద్దలు కొట్టారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక జో బైడెన్ తొలిసారి QUAD సమావేశంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం ప్రపంచం ముందున్న సవాళ్లపై QUAD దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. కొవిడ్-19 సంక్షోభం నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ప్రపంచ దేశాలకు ఎలా సాయం అందించాలి..? అనే అంశాలపై చర్చించారు. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పర్యావరణ మార్పులు, ఆరోగ్యం, టెక్నాలజీ రంగంలో ఆవిష్కరణలు అంశాలపైనా QUAD ఆన్లైన్ సదస్సులో చర్చ జరిగింది. వాతావరణ మార్పుపై పోరు, కోవిడ్ 19 టీకా, నూతన సాంకేతికలు అనే ప్రపంచానికంతటికీ మంచి జరిగేందుకు ఉద్దేశించిన అంశాలను ఈ భేటీకి అజెండాగా తీసుకోవడాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. వసుధైక కుటుంబం అనే భారతీయ భావనకు ఈ కూటమి కొనసాగింపని అన్నారు. కలిసికట్టుగా, గతంలో కన్నా ఐక్యంగా పనిచేద్దామని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, నేవిగేషన్ స్వేచ్చ, మెరీటైమ్ సెక్యూరిటీ అంశాలపై QUAD దేశాధినేతలు ప్రధానంగా దృష్టిసారించారు. సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని పేర్కొన్నారు. ప్రపంచ సుస్థిరత, శాంతి స్థాపన కోసం క్వాడ్ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. విస్తరణకాంక్ష మంచిది కాదని పరోక్షంగా చైనాకు హెచ్చరికలు పంపారు.
ప్రధాని నరేంద్ర మోదీ చొరవతోనే QUAD కూటమి బలోపేతమైంది. నిజానికి, కూటమికి 2004లోనే బీజం పడింది. 2007లో అది కార్యరూపం దాల్చింది. కౌంటర్ టెర్రరిజం, మెరీటైమ్ సెక్యూరిటీ, ప్రపంచశాంతి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సరస్పర సహకారంతో ముందుకు పరిష్కరించుకోవడం తదితర అంశాలు ప్రాతిపదికగా నాలుగు దేశాలు కలిసి క్వాడ్‌గా ఏర్పడ్డాయి. అయితే.. 2008లో చైనా ఒత్తిడి కారణంగా ఆస్ట్రేలియా వెనక్కి తగ్గినా.. ఆ తర్వాత మళ్లీ కూటమిలో చేరింది. ఇక, గతేడాది గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో QUAD కూటమి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవైపు LAC వెంబడి చైనాకు చెక్ పెడుతూనే.. మరోవైపు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టడంలో భారత్ కీలక పాత్ర పోషించింది.
ఇందులో భాగంగా.. QUAD కూటమి బలోపేతానికి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా కృషిచేశారు. చైనా కుయుక్తులను ఎండగట్టాలంటే QUAD ఎంత అవసరమో సభ్యదేశాలకు వివరించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని సూగా, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ లకు QUAD ఆవశ్యకతను తెలియజేశారు. అడ్డదారుల్లో ప్రపంచశక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టాలంటే.. అది QUAD కూటమితోనే సాధ్యమవుతుందని విశ్లేషణాత్మకంగా వివరించారు. దీంతో కూటమి కొత్త రూపం సంతరించుకుంది. QUAD కూటమి అనతికాలంలోనే ఆసియాలో ప్రబలశక్తిగా ఎదిగింది. విదేశాంగ నిపుణులు ప్రస్తుతం దీనిని ‘ఆసియా నాటో’ అభివర్ణిస్తున్నారంటే QUAD శక్తిని మనం అంచనా వేయచ్చు.
అందుకే, జిత్తులమారి చైనా ఈ కూటమిని చూసి వణికిపోతోంది. QUAD కార్యరూపం దాల్చడంతో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న ఆశలు గల్లంతవుతాయని తెగ గింజుకుంటోంది. ఇండో పసిఫిక్ సముద్ర జలాలపై చైనా ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తోంది. దానికి చెక్ పెట్టేలా QUAD కూటమి వ్యూహాలు రచించింది. సంయుక్తంగా నేవీ విన్యాసాలు నిర్వహించడానికి కూటమి సభ్య దేశాలు అంగీకరించాయి. దీంతో ఇప్పుడు చైనాకు ముచ్చెమటలు పడుతున్నాయి. QUAD తమను ఎంత భయపెడుతోందో.. చైనా చెప్పకనే చెప్పింది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు.. QUAD సమావేశానికి కొన్ని గంటల ముందు మీడియా మందు నీతులు వల్లెవేసింది. మీడియాతో మాట్లాడిన విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్.. కూటమి దేశాలకు సుద్దులు చెప్పాడు. దేశాల మధ్య సహకారం, సంప్రదింపులు మరో దేశాన్ని లక్ష్యంగా చేసుకునేలా ఉండొద్దని చైనా వ్యాఖ్యానించింది. దేశాలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడడం సరికాదని.. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ‘క్వాడ్’ భేటీని పరోక్షంగా ప్రస్తావించాడు. దీనిని బట్టి QUAD ను చూసి ఎంతలా భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు.