More

    సెమీస్ లో ఓడిన సింధు..!

    సెమీ ఫైనల్ లో సింధు ఓటమి పాలైంది. వరుసగా రెండు గేమ్స్ ను కోల్పోయి ఫైనల్ కు వెళ్లలేకపోయింది. వరుసగా రెండు ఒలింపిక్స్ ఫైనల్ లో ఆడాలని అనుకున్న సింధు ఆశలపై వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ నీళ్లు జల్లింది. ఈ మ్యాచ్ లో సింధు వరుసగా రెండు గేమ్స్ ను ప్రత్యర్థికి కోల్పోయింది. తొలి గేమ్ ను తై జు యింగ్ 21-18 తేడాతో కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్ లో అయినా సింధు పోరాడుతుందని అనుకోగా.. అది కూడా వీలుపడలేదు. తై జు యింగ్ దూకుడు ముందు సింధు నిలవలేకపోయింది. సింధుకు స్మాష్ లకు అవకాశం ఇవ్వకుండా నెట్ దగ్గర తై జు యింగ్ అద్భుతంగా ఆడింది. దీంతో పాటూ సింధు అనవసర తప్పిదాల కారణంగా రెండో గేమ్ ను 12-21 తో ఓటమిని చవి చూసింది. రెండు గేమ్స్ లోనూ అద్భుతంగా ఆడిన తై జు యింగ్ 21-18, 21-12 తో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. సింధు ఇంకా పతకం రేసులో ఉంది. కాంస్యం కోసం జరిగే మ్యాచ్ లో ఆడనుంది. ఆదివారం నాడు సింధు కాంస్యం కోసం మ్యాచ్ ఆడనుంది.

    ఒలింపిక్స్‌లో భాగంగా భారత మహిళల హాకీ జట్టు శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో 4-3 తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి రెండు క్వార్టర్లలో వందన కటరియా రెండు గోల్స్‌ చేయడంతో 2-1తో భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. సౌతాఫ్రికా మూడో క్వార్టర్‌లో రెండు గోల్స్‌ నమోదు చేసి 3-3తో స్కోరును సమం చేసింది. కీలకమైన నాలుగో క్వార్టర్‌లో వందన కటారియా మరో గోల్‌తో మెరవడంతో భారత్‌ 4-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్‌ ఈ విజయంతో లీగ్‌ దశలో ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు.. మూడు ఓటములతో కలిపి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌ క్వార్టర్స్‌ చేరాలంటే ఐర్లాండ్‌- గ్రేట్‌ బ్రిటన్‌ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఓడిపోవాలి. మ్యాచ్‌ డ్రా అయినా భారత్‌ క్వార్టర్స్‌కు క్వాలిఫై అవుతుంది. ఐర్లాండ్‌ గెలిస్తే మాత్రం భారత మహిళల జట్టు ఇంటిముఖం పడుతుంది.

    టోక్యో ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో 69-75 కిలోల మ‌హిళ‌ల బాక్సింగ్ బౌట్‌లో.. పూజా రాణి ఓట‌మి పాలైంది. క్వార్ట‌ర్స్‌లో చైనా బాక్స‌ర్ లీ క్వియాన్ చేతిలో 5-0 తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే పూజా రాణికి ఖచ్చితంగా పతకం వచ్చి ఉండేది. కానీ అది జరగలేదు.

    భారత డిస్క‌స్ త్రోయ‌ర్ క‌మ‌ల్‌ప్రీత్ కౌర్ ఫైన‌ల్ చేరింది. శ‌నివారం ఉద‌యం జ‌రిగిన క్వాలిఫికేష‌న్‌లో ఆమె 64 మీట‌ర్ల దూరం విసిరి.. ఫైన‌ల్స్ లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. గ్రూప్ ఎ, గ్రూప్ బి క్వాలిఫికేష‌న్ల‌లో క‌లిపి క‌మ‌ల్‌ప్రీత్ విసిరిందే రెండో అత్య‌ధిక దూరం కావ‌డం విశేషం. తొలి ప్ర‌యత్నంలో 60.59 మీట‌ర్ల దూరమే విసిరిన ఆమె.. రెండో ప్ర‌య‌త్నంలో ఏకంగా 63.97 మీట‌ర్లు, మూడో ప్ర‌య‌త్నంలో 64 మీట‌ర్ల మార్క్ అందుకుంది. ఇక ఈ ఈవెంట్‌లోనే గ్రూప్ ఎలో పార్టిసిపేట్ చేసిన మ‌రో ఇండియ‌న్ డిస్క‌స్ త్రోయ‌ర్ సీమా పూనియా 60.57 మీట‌ర్ల దూరమే విసిరి ఫైన‌ల్‌కు క్వాలిఫై కాలేక‌పోయింది. ఆమె 16వ స్థానంలో నిలిచింది.

    Trending Stories

    Related Stories