ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలయ్యారు. ఇది ఓ తెలుగు సినిమాలోని పాట. జ్వాల, రగిలింపులు వ్యక్తులు, కుటుంబాల వరకు అయితే పరిష్కార మార్గం వుండవచ్చేమో కాని.. దేశాల మధ్య అయితే.. ఇక ఆ కార్చిచ్చును ఆపేది ఎవరు..? జ్వాల ఎలా పుట్టిందో ఏమో.. కాని రష్యా, ఉక్రెయిన్ ల మధ్య వైరం తారాస్థాయి చేరింది. అగ్రరాజ్యం అమెరికా పనికిమాలిన పెత్తనం.. రష్యా మరింత రెచ్చిపోవడానికి కారణం అవుతోంది. చినికి, చినికి గాలివాన స్థాయిని ఏనాడో దాటిపోయి..పెను ఉప్పెనగా మారిపోయాక.. ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు. దేశాల మధ్య రగిలిన జ్వాలను ఆర్పే ధైర్యం ఎవరికి వుంటుంది. రష్యా, ఉక్రెయిన్ వార్ లో రెండు దేశాల ప్రజల పండుటాకుల్లా వణికిపోతున్నారు. ఆ దేశాల సంపదకు చేటు వాటిల్లుతోంది. దేశనేతలకు మనశ్శాంతి కరువవుతోంది. అయితే, దీనికి ఎండ్ కార్డ్ పడాలని అందరూ కోరుకోవడం తప్ప.. ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు.
తాజాగా రష్యాలోని కెర్చ్ వంతెనను ఉక్రెయిన్ పేల్చివేసింది. దీంతో రష్యా రగిలిపోయింది. ఉక్రెయిన్ పై రష్యా సేనలు క్షిపణి దాడులతో విరుచుకుపడ్డాయి.
దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్ ఉగ్ర చర్యకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్టు స్పష్టం చేశారు. క్రిమియా, రష్యాను అనుసంధానం చేసే కీలక వంతెన పేల్చివేతలో.. ఉక్రెయిన్ ప్రత్యేక బలగాలదే ప్రధాన పాత్ర అని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పుతిన్ తెలిపారు. టర్కిష్ స్ట్రీమ్ పైప్ లైన్ ను సైతం పేల్చి వేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని అన్నారు. రష్యా పౌర, మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి ఈ తీవ్రవాద దాడి ఉద్దేశించబడిందని అన్నారు. ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీసెస్ ఈ టెర్రరిస్ట్ దాడికి ప్రణాళిక రచించి, అమలు పర్చిందని అన్నారు.
తమ దేశం విద్యుత్ శక్తి సౌకర్యాలు, గ్యాస్ రవాణా వ్యవస్థలపైన సైతం అనేక తీవ్రవాద దాడులు జరిగాయని పుతిన్ అన్నారు. టర్క్‌స్ట్రీమ్ గ్యాస్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌లోని ఒక సెక్షన్‌ను బలహీనపరిచే ప్రయత్నంతో సహా ఎన్నో అవాంఛనీయ సంఘటనలకు ఉక్రెయిన్ పాల్పడిందని అన్నారు. నిర్బంధించిన నేరస్థుల సాక్ష్యంతో సహా ఆబ్జెక్టివ్ డేటా ద్వారా ఈ ఉగ్రవాద దాడులు రుజువు చేయబడ్డాయన్నారు. తమ భూభాగంపై తీవ్రవాద దాడులు కొనసాగించే ప్రయత్నాలు చేస్తే, రష్యా ప్రతిస్పందనలు సైతం కఠినంగా ఉంటాయని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ ఇంధనం, మిలటరీ, కమ్యునికేషన్ స్థావరాలపై దాడులు జరపడాన్ని ఆయన సమర్థించుకున్నారు.
ఉక్రెయిన్ పై జరిపిన క్షిపణి దాడులు కేవలం ఆరంభం మాత్రమే అని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్విదేవ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. నీరు, విద్యుత్, సేవలకు అంతరాయం కల్గించేలా క్షిపణి దాడులు చేసినట్టు చెప్పారు. ఉక్రెయిన్ ఇంధనం, మిలటరీ కమాండ్, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది.
ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడులు సరికాదని యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ ట్వీట్ చేశారు. ఈ చర్య పుతిన్ బలహీనతను తెలియజేస్తోందన్నారు. పుతిన్ సేనల దాడుల్లో కీవ్‌లో 11 మంది మృతి చెందారని, 64 మంది గాయాలు పాలయ్యారని ఉక్రెయిన్ పోలీసుల వెల్లడించారు. సెంట్రల్ షెవ్కెంకో యూనివర్సిటీ, మ్యూజియం దెబ్బతిన్నాయని, ఎన్నో చెట్ల కొమ్మలు కాలిపోయాయని చెప్పారు.