పుతిన్ క్షమాపణలు చెప్పలేదా..? స్నేహానికి విలువిచ్చారా..?

0
913

ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచ దేశాల హెచ్చరికలన సైతం లెక్క చేయలేదు. కానీ తొలిసారి పుతిన్ క్షమాపణలు చెప్పారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచ మీడియా దీనిపై వరుస కథనాలు వేస్తున్నాయి. అయితే పుతిన్ క్షమాపణలు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా..? ఉక్రెయిన్ విషయంలో ఇతర దేశాల హెచ్చరికలు ఖాతర్ చేయని పుతిన్ ఇప్పుడు ఏ విషయంలో సారీ చెప్పారు..? ఎవరికి చెప్పారు..?

ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు రెండున్నర నెలలుగా రష్యా సైన్యం ఉక్రెయిన్‌లో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఈ క్రమంలో ప్రపంచలోని అనేక దేశాలు రష్యా చర్యలను తప్పుబడుతున్నాయి. పుతిన్ తీరును నిరసిస్తూ ఆ దేశంపై ఆంక్షలు విధిస్తున్నాయి. అయినా పుతిన్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. పైగా రష్యాపై ఆంక్షలు విధిస్తున్న దేశాల అధినేతలను తమ దేశంలోకి రావడానికి వీల్లేందంటూ బహిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో పుతిన్ తీరుపై అమెరికా, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలతో పాటు పలు దేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. పుతిన్‌ను ఎలా లొంగదీసుకోవాలా అన్నఆలోచనలు చేస్తున్నాయి. అలాంటి పుతిన్ ఇజ్రాయెల్ ప్రధానికి క్షమాపణలు చెప్పడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రో‌వ్ ఈ మధ్య ఓ ఇటలీ మీడియా హౌజ్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అడాల్ఫ్ హిట్లర్‌లోనూ బహుశా యూదుల రక్తం ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ను డీ-నాజీఫై చేస్తామంటూ ప్రకటించుకున్న రష్యా.. తన పోరాటాన్ని ఎలా సమర్థించుకుంటుందంటూ లావ్‌రోవ్‌కు ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ స్వయంగా ఓ యూదు, అయినప్పటికీ ఆ దేశంలో నాజీయిజం ఉనికి ఉండొచ్చు, కానీ హిట్లర్‌లోనూ యూదు రక్తం ఉందికదా.. అదేం విషయం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను చాలా దేశాల అధినేతలు, ప్రతినిధులు ఖండించారు. ఈ వ్యాఖ్యలతో ఇజ్రాయెల్, రష్యా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. లావ్‌రోవ్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ సీరియస్‌గా తీసుకుంది. ఆ దేశ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ స్వయంగా ఇజ్రాయెల్‌లోని రష్యా రాయబారిని పిలిపించుకొని వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సూచించారు.

ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్ ప్రధానికి రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఇజ్రాయెల్ 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బన్నెట్‌కు గురువారం రష్యా అధ్యక్షుడు ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని ట్విటర్‌లో పోస్ట్ చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే మానవతావాద అభ్యర్థనతో మారియుపోల్‌లోని అజోవ్ స్టాల్ నుండి రష్యా సైన్యంను వెనక్కు తీసుకోవాలని పుతిన్‌ను ఇజ్రాయెల్ ప్రధాని కోరినట్లు తెలిసింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here