రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు రానున్నారు. డిసెంబర్ నెలలో భారత్‌కు రానున్నారు. వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా డిసెంబర్ మొదటి వారంలో పుతిన్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా డిసెంబర్ 6న ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత రష్యా అధ్యక్షుడికి ఇది రెండో విదేశీ పర్యటన కావడం విశేషం. ఇంతకుముందు ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జెనీవాలో సమావేశమయ్యారు. ఇటలీలో జరిగిన జీ 20 సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నారు. పుతిన్ చివరిసారిగా 2018లో భారత్‌లో పర్యటించారు. అప్పుడు 400 డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను భారత్, రష్యా కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది చివరికి ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్స్‌కు చెందిన పరికరాల్లో మొదటి బ్యాచ్ భారత్‌కు చేరనున్నాయి. గతేడాది జరగాల్సిన శిఖరాగ్ర సదస్సు కరోనా నేపథ్యంలో రద్దవగా.. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 20 వార్షిక శిఖరాగ్ర సదస్సులు జరిగాయి.
2019లో ప్రధాని మోదీ తూర్పు రష్యా నగరమైన వ్లాడివోస్టాక్‌ను సందర్శించారు. 5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌కు గౌరవ అతిథిగా కూడా ఉన్నారు. రష్యాతో భారతీయ వ్యాపార భాగస్వామ్యాన్ని పెంచడానికి భారతదేశం 1 బిలియన్ డాలర్ల సాఫ్ట్ క్రెడిట్ లైన్‌ను ప్రకటించింది. కోవిడ్ సంక్షోభం సమయంలో కూడా ఇరు దేశాలు ఒకరికొకరు అండగా నిలిచాయి. రష్యా యొక్క స్పుత్నిక్ V వ్యాక్సిన్ భారతదేశంలో ఉత్పత్తి చేయబడుతోంది. కోవిడ్ సంక్షోభం సమయంలో భారత్ కు రష్యా తమ సహాయాన్ని పంపింది. రెండు దేశాలు కూడా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. రష్యా జాతీయ భద్రతా సలహాదారు (భద్రతా మండలి సెక్రటరీ) నికోలాయ్ పి. పత్రుషేవ్ ఆగస్టులో కాబూల్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి ఆ దేశంలోని పరిస్థితిని చర్చించడానికి రెండు సార్లు ఢిల్లీకి వచ్చారు. భారతదేశం యొక్క అతిపెద్ద రక్షణ భాగస్వామిగా రష్యా ఉంది.