ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై రెండునెలలు దాటిపోయింది. ఇందులో రష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా భారీగా నష్టపోతోంది. అయినా యుద్దం మాత్రం ఆగడం లేదు. మధ్యలో చర్చల పేరుతో కొంత హంగామా చేసినా తిరిగి ఇరుదేశాలూ యుద్ధంలో మునిగిపోయాయి. అంతర్జాతీయంగా భారీగా ఒత్తిడి ఎదురువుతున్నా, ఉక్రెయిన్ లో ఎదురుదెబ్బలు తగులుతున్నా రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మే 9 ఈ వార్ కు ఓ టర్నింగ్ పాయింట్ ఇస్తుందన్న ప్రచారం సాగుతోంది.
అయితే ఇప్పుడు ఆ ఆక్రమణను అధికారికంగా ప్రకటించనున్నారు. మే 9వ తేదీలోగా ఉక్రెయిన్‌పై అధికారికంగా పుతిన్ యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ చర్యలో భాగంగా రష్యా తన పూర్తి సైన్యాన్ని ఉక్రెయిన్ భూభాగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. మే 9న ఉక్రెయిన్‌లో సాధించిన సైనిక చర్య ఫలితాలను పుతిన్ వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఫిబ్రవరి 24వ తేదీన రష్యా దాడికి దిగింది. కానీ ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నట్లు కానీ, ఆక్రమణకు వెళ్లినట్లు కానీ పుతిన్ అధికారికంగా చెప్పలేదు.
మే 9న రష్యా యుద్దం ముగించబోతోందంటూ నెల రోజుల క్రితమే ప్రచారం మొదలైంది. 1945లో జర్మనీ నాజీ సేనలు మిత్రరాజ్యాలకు లొంగిపోయిన మే 9న ఉక్రెయిన్ పై వార్ ను రష్యా ముగించే అవకాశముందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై రష్యా విదేశాంగమంత్రిసెర్గీ లావ్రోవ్ ఇవాళ స్పష్టత ఇచ్చారు. మే 9న ఉక్రెయిన్ పై యుద్ధం ముగించాలని తాము కోరుకోవడం లేదని ఆయన ప్రకటించారు.
మే 9న విక్టరీ డే నాటికి ఉక్రెయిన్‌లో తన యుద్ధాన్ని ముగించాలని రష్యా చూడటం లేదని విదేశాంగ మంత్రి లావ్రోవ్ తెలిపారు. ఇటాలియన్ అవుట్‌లెట్ మీడియాసెట్‌తో మాట్లాడుతూ సెర్గీ లావ్‌రోవ్ 1945లో అప్పటి సోవియట్ యూనియన్‌తో సహా మిత్రరాజ్యాల దళాలకు నాజీ జర్మనీ లొంగిపోయినందుకు జరుపుకునే వార్షికోత్సవం సందర్భంగా మాస్కో తన “ప్రత్యేక సైనిక ఆపరేషన్” గా భావిస్తున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి తొందరపడటం లేదన్నారు. విక్టరీ డేతో సహా ఏ తేదీకైనా మా సైన్యం కృత్రిమంగా వారి చర్యలను మార్చుకోదని తాజాగా విడుదల చేసిన ఇంటర్వ్యూలో లావ్రోవ్ చెప్పారు.
ఉక్రెయిన్‌లో ఆపరేషన్ వేగం పౌర జనాభా, రష్యన్ సైనిక సిబ్బందికి ఏవైనా ప్రమాదాలను తగ్గించాల్సిన అవసరంపై మాత్రమే ఆధారపడి ఉంటుందన్నారు. రష్యా సాధారణంగా విక్టరీ డేని ఘనంగా నిర్వహిస్తుంది. సెంట్రల్ మాస్కోలో పెద్ద సైనిక కవాతుతో పాటు ఐరోపాలో ఫాసిజం ఓటమిలో దేశం యొక్క ప్రధాన పాత్రను ప్రశంసిస్తూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యా ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.