More

    పాక్ ఛాయలో పంజాబ్ పాలిటిక్స్..! డ్రోన్ దాడుల సూత్రధారులెవరు..?

    పంజాబ్ రాజకీయ సంక్షోభం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటగా కూడా పంజాబ్ తాజా పరిణామాలను చూడకూడదు. దేశభక్తికీ, జాతివ్యతిరేకతకూ, పాకిస్థాన్ అనుకూల- వ్యతిరేక ముఠాల మధ్య జరుగుతున్న సంకులసమరంలో దేశ భద్రత, జాతి సమగ్రత ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. కొరివితో తలగోక్కోవడం కాంగ్రెస్ కు అలవాటు. అప్పుడప్పుడూ తన కొరివితో ఇతరుల తలల్ని లక్ష్యంగా చేసుకుంటుంది. పంజాబ్ లో జరుగుతున్నది ఇదే!

    దేశంలో మూడు కీలకమైన రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్రాల్లో శాంతి భద్రతలు అదుపులో లేవు. అక్రమ వసూళ్లు, బెదిరింపులకు పాల్పడిన ఐపీఎస్ అధికారి, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంవీర్ గుట్టుగా సరిహద్దులు దాటివెళ్లిపోయాడు. మహారాష్ట్ర ప్రభుత్వం గానీ, జాతీయ దర్యాప్తు సంస్థలు కానీ, పరంవీర్ ఆనుపానులు కనిపెట్టలేకపోతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వాటికన్ పాట పాడుతున్నారు. భవానీపూర్ ఉప ఎన్నికలో హింస బెంగాల్ పరిస్థితికి నిదర్శనం. దీదీ అడ్డూఅదుపూ లేని హెచ్చరికలు చేస్తున్నారు.

    పాకిస్థాన్ సరిహద్దుల వైపు నుంచి పంజాబ్ లోకి డ్రోన్ ల ద్వారా ఆయుధాలు, మందుగుండు, పేలుడుపదార్థాలు సరఫరా అవుతన్నాయని మొన్నటిదాక ముఖ్యమంత్రిగా కొనసాగిన అమరీందర్ సింగ్ దోవల్ తో జరిగిన భేటిలో వెల్లడించినట్టూ వార్తలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ కు బంగ్లాదేశ్, పంజాబ్ కు పాకిస్థాన్ సరిహద్దులుగా ఉన్నాయి. అరేబియా తీరంలోని ముంబై నగరం గడచిన మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదానికి స్థావరంగా ఉంటోంది. 26/11 ఘటన తాలూకు నెత్తుటి తడి ఇంకా ఆరలేదు. కొంకణ్ తీరం నుంచి మత్తు పదార్థాల రవాణా ఉండనే ఉంది.

    పంజాబ్ రాజకీయ సంక్షోభం కేవలం ఆ రాష్ట్రానికే ఎందుకు పరిమితం కాదు? అమరీందర్, సిద్దూ వర్గాల కాట్లాటలో ఐఎస్ఐ దూరిందా? అసలు కాంగ్రెస్ నిర్ణయాలు ఆ పార్టీయే తీసుకుంటోందా? లేదా ఏడేడు సముద్రాల అవతల మాయల ఫకీరు తీసుకుంటున్నాడా?

    అమరీందర్ అమిత్ షాను కలిశాడు సరే! అజిత్ దోవల్ తో ఎందుకు భేటీ అయినట్టూ…భద్రతకు సంబంధించిన కీలక రహస్యాలు వెల్లడించాడా? ఖలిస్థాన్ అనుకూల-ఐఎస్ఐ సానుకూల వర్గాల ప్రాబల్యం క్రమంగా పెరుగుతోందా? సుదీర్ఘ సరిహద్దు రాష్ట్రంలోని అస్థిరత ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది?

    పంజాబ్ రాజకీయ సంక్షోభంలో డ్రోన్ల ఊసు ఎందుకు వచ్చిందీ? ఈ ప్రశ్న చాలా మందిని కలవరపెడుతోంది. పంజాబ్ సరిహద్దుల్లో గడచిన మూడేళ్ల కాలంలో ఆయుధాలను పాకిస్థాన్ డ్రోన్లు జారవిడిచాయి. వీటిని బీఎస్ఎఫ్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన 4 ఘటనలు చెప్పి…డ్రోన్లు ఎవరు పంపుతున్నారు? ఎవరికి పంపుతున్నారు? డ్రోన్లకు సంబంధించి కేప్టెన్ అమరీందర్ సింగ్ వద్ద ఎలాంటి సమాచారం ఉండే వీలుంది? అనే విషయాల్లోకి వస్తాను.

    ఈ ఏడాది మార్చి 13న పాకిస్తాన్ కు చెందిన డ్రోన్  భారత సరిహద్దుల్లోకి  ప్రవేశించింది. అయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తమై కాల్పులు జరపడంతో వెంటనే అది తిరిగి పాక్ వైపు వెళ్ళిపోయింది. పంజాబ్ పఠాన్ కోట్ జిల్లా సమీపంలోని దిండా  పోస్ట్ వద్ద భారత-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ డ్రోన్ ని కనుగొన్నారు. 

    గత ఏడాది  డిసెంబరులో పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా సమీపంలో.. పాకిస్తాన్ కి చెందిన డ్రోన్  11 హ్యాండ్ గ్రెనేడ్లను జార విడిచింది. ఒక పొలంలో వీటిని కనుగొన్నారు.ఓ నైలాన్ తాడుతో వీటిని జారవిడిచిందని అధికారులు గుర్తు చేశారు.  2019 సెప్టెంబరులో కూడా పాక్ డ్రోన్  రెండు పిస్టల్స్ ని కొన్ని తూటాలను తార్న్ తారన్ జిల్లాలో జారవిడిచింది. అందులో కొన్ని ఫేక్ కరెన్సీ నోట్లు కూడా ఉన్నాయి. కాగా తాజా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

    2019 అక్టోబర్ 6,7 తేదీల్లో ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని హుస్సేనివాలా సరిహద్దు పోస్టు దగ్గర ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్  సిబ్బంది పాకిస్తాన్ వైపు నుండి భారత భూభాగంలోకి దాదాపు ఒక కిలోమీటర్ దూరం అక్రమంగా ప్రవేశించిన డ్రోన్‌ను గుర్తించారు. వెంటనే పంజాబ్ పోలీసులను బీఎస్ఎఫ్ అలర్ట్ చేయడంతో డ్రోన్ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

    ఈ ఏడాది సెప్టెంబర్ 2,3 తేదీల్లో అనుమానాస్పద డ్రోన్​ను సరిహద్దు భద్రతా సిబ్బంది కూల్చేశారు. ఈ ఘటన పంజాబ్​లోని తార్న్​తరాన్​ జిల్లాలో జరిగింది. పెద్ద ఎత్తున ఏకే-47 రైఫిల్స్, శాటిలైట్ ఫోన్లు, గ్రెనేడ్లను, ఎనిమిది ప్రాంతాల్లో దించినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.  5 కిలోల పేలుడు పదార్థాలను మోస్తున్న డ్రోన్‌లు గుర్తించకుండా ఉండటానికి వేగంగా, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను ఐఎస్ఐ వాడుతోంది.  ఇవి మచ్చుకు…పాకిస్థాన్ పంజాబ్ సరిహద్దుల్లో జారవిడిచిన ఆయుధాల సంగతి….పశ్చిమ కమాండ్ లోనూ, ఉత్తర కమాండ్ లోనూ పాకిస్థాన్ డ్రోన్ల తాకిడి ఇటీవల పెరిగింది.

    అధునాతన టర్కీ డ్రోన్ టెక్నాలజీని కూడా పాకిస్థాన్ వాడుతున్నట్టూ వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత ఆధునాతనమైన డ్రోన్ టెక్నాలజీ కలిగిన దేశాల్లో టర్కీ ఒకటి. బేర్తర్‌ టీబీ2 డ్రోన్లు టర్కీ వద్ద ఉన్నాయి. ఇవి అత్యంత ప్రమాదకరం. టర్కీ వద్ద నాటో దళాలు అనుసరించే రోబోటిక్‌ యుద్ధ వ్యూహాలున్నాయి.

    గతేడాది టర్కీ తన డ్రోన్ టెక్నాలజీని నాగర్నో-కారాబాక్ యుద్ధానికి ముందు అజర్‌ బైజన్‌కు అందజేసింది. అంతేకాదు, సిరియాలోని టర్కీ కిరాయి మూకలకు కూడా సరఫరా చేసింది. ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా కూటమి సేనలు Special Operations Forces Laser Acquisition Marker-SOFLAM అనే ప్రత్యేకమైన పరికరాన్ని వినియోగించాయి. దీంతో కొండలపై ఉన్న తాలిబాన్ల స్థావరాలను గుర్తించి లేజర్‌ సాయంతో ప్రత్యేకంగా మార్కింగ్‌ చేశాయి. అంటే లక్ష్యాలను గుర్తించడం అన్నమాట.

    ఆ తర్వాత నాటో సంకీర్ణ దళాల విమానాలు, డ్రోన్లు రంగంలోకి దిగి.. ఈ లేజర్‌ మార్కింగ్‌ను తమ గైడెడ్‌ జేడీఎఎం బాంబులకు లాక్‌ చేసి ప్రయోగించేవి. అవి కచ్చితంగా లక్ష్యాలను ఛేదించేవి. టర్కీ ఉక్రెయిన్‌ నుంచి రెండో ప్రపంచయుద్ధ కాలం నాటి ఏఎన్‌-2ఎస్‌ విమానాలను కొనుగోలు చేసింది. వీటిని రిమోట్‌ విమానాలుగా మార్చేసింది. అర్మేనియా ఎయిర్‌ డిఫెన్స్ లు ఎక్కడ ఉన్నాయో గుర్తించేందుకు వీటిని ఎరగా వేసింది. ఆ తర్వాత ఎయిర్‌ డిఫెన్స్ లపై డ్రోన్లతో దాడి చేసి ధ్వంసం చేసింది.

    దిక్కూ…దివాణం లేకుండా, ఖచ్చితమైన లక్ష్యాలు లేకుండా పాకిస్థాన్ లాపతాగా డ్రోన్లను పంపదు. ఎవరిని ఉద్దేశించి సదరు డ్రోన్లను పంపుతుంది? రిసీవర్లు ఎవరు? అనేది నిఘా బృందాలను వేధిస్తోంది. సంచలనం సృష్టించిన పంజాబ్ టిఫిన్ బాంబు కేసు దర్యాప్తులో పోలీసులకు ఆశ్చర్యకరమైన నిజాలు తెలిశాయి.

    సరిహద్దులు దాటి పంజాబ్ లోకి ఆయుధాలు చేరవేస్తున్న డ్రోన్ల కోసం నిరీక్షిస్తున్న కొంతమంది గురించి వాకబు చేసింది. ఐఎస్ఐ ఢిల్లీ మాడ్యూల్ ను పట్టుకుంది. జాన్ మొహ్మద్ షేక్, ఒసామా, మూల్ చంద్, జీషాన్, మొహమ్మద్ అబూబకర్, మొహమ్మద్ అమీర్ జావెద్ లను అరెస్టు చేసింది. జైషే మహమ్మద్, లష్కర్ ఏ తయిబా, ఇండియన్ ముజాహిదీన్ తో పాటు నేరుగా పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న స్లీపర్ సెల్స్, మాడ్యూల్స్ కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందజేసేందుకు పంజాబ్ ను ఎన్నుకున్నారన్నమాట.

    జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి హోదా తొలగించడానికి ముందు కశ్మీర్ లోయలో బాహటంగా పోలీసులకు తెలిసే పేలుడు పదార్థాల రవాణా జరిగేది. ఆయుధాలు చేతులు మారేవి. పోలీసులు, నిఘా అధికారులు సహకరించేవారు. జైళ్లలోని ఉగ్రవాదులు తప్పించుకునేందుకు జైళ్ల శాఖ సాయం అందించేది. అయితే ఆర్టికల్ 370-35 ఏ రద్దు తర్వాత కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధన 311కు సవరణలు చేసింది.

    ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ, సహకరించడం కానీ చేసిన ఉద్యోగులను ఎలాంటి విచారణ లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించేందుకు తాజా సవరణ మార్గం సుగమం చేసింది. దీంతో పాటు కశ్మీర్ లోయలో భద్రతాబలగాలు పకడ్బందీ ఆపరేషన్లు చేస్తుండటంతో ఆయుధ అక్రమ రవాణా మార్గాలు మూసుకుపోయాయి.

     కశ్మీర్ లోయలో తమ ఆటలు సాగట్లేదు కాబట్టి పంజాబ్ ను ఎన్నుకుంది పాకిస్థాన్. పాక్ అనుకూల శక్తులు కొంతమంది ప్రభత్వంలోని వివిధ విభాగాల్లో ఉండటం అందుకు అనుకూలించింది. కాంగ్రెస్ నేత సిద్దూ-పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ బాజ్వాల బాహట భేటీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సన్నిహితత్వం, సిద్దూ సన్నిహితులు ప్యారేలాల్ గార్గ్, మల్వీందర్ సింగ్ మాలీలు పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు చేయడం…ఐఎస్ఐ-కాంగ్రెస్ బంధానికి సాక్ష్యాలంటారు పరిశీలకులు. అమరీందర్ సింగ్ స్వయంగా సిద్దూ-బాజ్వాల భేటీని ప్రశ్నించారు.

    పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్ణయాలను నిజంగానే ఏఐసీసీ తీసుకుంటోందా? అనే అనుమానాలూ ముసురుకుంటున్నాయి. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నవ్ జోత్ సింగ్ సిద్దూకు పీసీసీ బాధ్యతలు అప్పగించడమేంటి?

    గాంధీ కుటుంబానికి అతి సన్నిహితంగా దశాబ్దాలుగా మెలుగుతున్న అమరీందర్ అభిప్రాయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే ప్రశ్నలు రాకమానవు. దేశ సమగ్రతపై కాంగ్రెస్ తన మౌలిక అభిప్రాయాలను మార్చుకుందా? కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను పరోక్షంగా ఐఎస్ఐ చేస్తోందా అనే అనుమానాలు ముసురుకుంటున్నాయి.

    ‘నాకౌగిలింత పనిచేసింది చూశారా?’ అని గతంలో గర్వపడ్డాడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ. గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారానికి వెళ్ళిన ఈ ఆషాడభూతి పాక్‌ ఆర్మీచీఫ్‌ బాజ్వాను ఆలింగనం చేసుకోవడం రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. కర్తార్‌పూర్‌ సాహిబ్‌ కారిడార్‌ తెరుస్తామని బాజ్వా అన్నారనీ, పదికోట్లమంది సిక్కుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాను అలా ప్రవర్తించానని సిద్దూ ప్రకటించడంతో బీజేపీ అగ్గిమీద గుగ్గిలమైంది. రెండు దేశాల మధ్యా మాటమాత్రంగా రాని అంశాన్ని తెరమీదకు తెచ్చి సిద్దూ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. 

    సిద్దూ రాజకీయ చరిత్ర గురించి సరైన అవగాహన ఉన్న కేప్టెన్ “సిద్దూ ఒక మానవబాంబు వంటివాడు. అతను కాంగ్రెస్ పార్టీలో చేరితే దానిని పేల్చేస్తాడు. అని వ్యాఖ్యానించాడు. “సిద్దూ దీపావళి కానుక వంటివాడు” అని బాజ్వా చెప్పడం చూస్తే పంజాబ్ కాంగ్రెస్ కథ కంచికేనని అర్థమవుతోంది. కాంగ్రెస్ కథ కంచికి వెళ్లినా, పాకిస్థాన్ వెళ్లినా వచ్చే ముప్పేమీ లేదు కానీ, పంజాబ్ మరోసారి ఉగ్రవాదానికి అడ్డాగా మారితే మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

    భద్రత, సమగ్రతను ఫణంగా పెట్టే ధోరణిని గమంనించిన కేప్టెన్ అమరీందర్ సింగ్ సిద్దూను వీలైనంత దూరం పెట్టాడు. ఇక్కడ మొదలైన వివాదం అమరీందర్ ఉద్వాసన, చన్నీ పదవీ ప్రమాణం, సిద్దూ రాజీనామాగా పరిణమించింది. కేప్టెన్ బీజేపీలో చేరకుండా స్వంతంగా పార్టీ పెడతాడనే ప్రచారం ఊపందుకుంది. ఇందుకు బీజేపీ కూడా పచ్చజెండా ఊపి ఉండవచ్చు. రాబోయే ఎన్నికల్లో ఆప్, అకాలీదళ్, కాంగ్రెస్, బీజేపీ…కేప్టెన్ కొత్త పార్టీలు కలిస్తే…పంచముఖ పోటీ రసవత్తరంగా సాగనుంది.

    అయితే పంజాబ్ ఎన్నికల ఫలితాలు దేశభద్రతకు సవాల్ గా మారకూడదన్నదే మా అభిప్రాయం. కాంగ్రెస్ వేదికగా పంజాబ్ లో జరుగుతున్న ఈ పైశాచిక క్రీడకు అక్కడి ప్రజలే సమాధానం చెబుతారని విశ్వసిద్దాం.

    Related Stories