More

    భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. డ్రోన్ల ద్వారా వచ్చిన టిఫిన్ బాక్స్

    పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయింది. అమృత్‌సర్‌లోని దాలిక్‌ గ్రామంలో టిఫిన్‌ బాక్సులో ఉన్న ఐఈడీతో పాటు హ్యాండ్‌ గ్రనేడ్లను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌ డీజీపీ దినకర్‌ గుప్తా ఈపేలుడుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పిల్లల టిఫిన్ బాక్స్‌లో ఐఈడీ పేలుడు పదార్థాలు దొరికిన తర్వాత పంజాబ్ లో హై అలర్ట్ ప్రకటించామన్నారు.. దినకర్ గుప్తా మాట్లాడుతూ టిఫిన్ బాక్స్ పాకిస్తాన్ నుండి వచ్చినట్లు అనుమానిస్తున్నామని.. అది కూడా డ్రోన్ ద్వారా పంపిణీ చేయబడిందని చెప్పారు. పేలుడు పదార్థాలు పాక్‌ నుంచి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా డ్రోన్‌ ద్వారా తరలించి ఉంటారని.. శని, ఆదివారాల్లో ఆ ప్రాంతంలో డ్రోన్‌లు సంచరించాయని తెలిపారు. ఈ సమయంలో ఓ బ్యాగ్‌ను వదిలివెళ్లినట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని తెలిపారు. తెరచి చూస్తే టిఫిన్‌ బాక్స్‌, ఐదు హ్యాండ్‌ గ్రనేడ్‌, డిటోనేటర్లు ఉన్నాయని, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. రెండు కిలోల బరువున్న ఆర్‌డీఎక్స్‌, ఒక స్విచ్‌, రిమోట్‌ కంట్రోల్‌ను గుర్తించారన్నారు. డ్రోన్ల శబ్దాలను స్థానిక సర్పంచ్‌ పోలీసులకు సమాచారమిచ్చారని.. తాము ఎన్‌ఎస్‌జీ సమాచారం ఇచ్చామని అన్నారు. ఎన్‌ఎస్‌జీ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోందన్నారు. పేలుడు పదార్థాలు ఆత్యాధుకమైనవని వాటితో పేలుడు సంభవిస్తే భారీ విధ్వంసం జరిగి ఉండేదని తెలిపారు.

    గత రెండు, మూడు నెలల్లో సరిహద్దుల నుంచి కార్యకలాపాలు పెరిగాయని వాటిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. పిల్లలు, అమాయక వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని.. ప్రజలు ప్రయాణ సమయంలో బస్సులు, ఇతర వాహనాల్లో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ ఘటనకు ఏ టెర్రర్ గ్రూప్ కారణమో దినకర్‌ గుప్తా చెప్పలేదు. అయితే ఈ అంశంపై మరింత దర్యాప్తు చేయడానికి పోలీసులు కేంద్ర ఏజెన్సీలతో కలిసి పని చేస్తున్నారని దినకర్‌ గుప్తా వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు కొన్ని ఉగ్రవాద సంస్థలు భారత్ లో దాడులు చేయాలని భావిస్తూ ఉన్నాయని.. దీంతో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని ఆయన తెలిపారు.

    ఇటీవలి కాలంలో భారతదేశ సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం సంఖ్య పెరుగుతోంది. జూన్‌లో జమ్మూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) స్టేషన్‌ పై డ్రోన్ దాడుల తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కొన్ని రోజుల ముందు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో డ్రోన్ల సంచారం ఎక్కువైంది.

    Related Stories