More

  భగత్ సింగ్‎పై ఖలిస్తాన్ మద్దతుదారుడి విమర్శలు.. ఉగ్రవాది అంటూ పంజాబ్ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

  కొందరు దేశంలో ఉంటూనే దేశాన్ని విమర్శిస్తారు.. మరికొందరు అయితే ఏకంగా స్వాతంత్ర సమరయోధులనే అవమానిస్తూ మాట్లాడుతున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం అల‌వోక‌గా ప్రాణాలొదిన విప్ల‌వ నాయ‌కుడు భ‌గ‌త్‌సింగ్‌పై పంజాబ్ లోక్‌స‌భ స‌భ్యుడు, అకాలీద‌ళ్ పార్టీ నాయ‌కుడు సిమ్రాన్‌జిత్ సింగ్ మాన్ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్యలు చేశారు.

  భ‌గ‌త్‌సింగ్ ఉగ్ర‌వాది అని అవమానించాడు. ఒక ఇంగ్లిష్ నేవీ అధికారిని, సిక్కు పోలీస్ కానిస్టేబుల్ చ‌న్న‌న్ సింగ్‌ల‌ను హ‌త్య చేశాడ‌ని చెప్పారు. జాతీయ అసెంబ్లీపై బాంబు విసిరిన భ‌గ‌త్‌సింగ్ ఉగ్ర‌వాది కాదా? చెప్పండ‌ని వితండవాదం చేశాడు. బీహార్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌లో గిరిజ‌నుల‌ను న‌క్స‌ల్స్ అని ఆరోపిస్తూ చంప‌డానికి వ్య‌తిరేకంగా ధ్వ‌జ‌మెత్తుతాన‌న్నారు. సిమ్రాన్‌జిత్ మాన్ వ్యాఖ్య‌ల‌పై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడిని అవ‌మానించార‌ని మండి ప‌డింది. భేష‌ర‌తుగా సిమ్రాన్‌జిత్ మాన్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేసింది. స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు భ‌గ‌త్‌సింగ్‌ను ఉగ్ర‌వాది అంటూ సంగ్రూర్ ఎంపీ సిమ్రాన్‌జిత్ మాన్ అన‌డం బాధ్య‌తారాహిత్యం, అవ‌మాన‌క‌రం, అగౌర‌వం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేసింది.

  అలాగే పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ సదరు ఎంపీపై మండిపడ్డారు. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం పంజాబ్ మాత్రమే కాదని, యావత్ దేశం భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల త్యాగాలను ఎప్పటికీ మరిచిపోదని, వారిపట్ల గర్వంగా ఉంటుందని వివరించారు. వీరి ప్రాణ త్యాగాల వల్ల ఇప్పుడు భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.

  ఇక సిమ్రాన్‌జిత్ మాన్ వ్యాఖ్య‌లు సిగ్గుచేటని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు, భ‌గ‌త్‌సింగ్ ఒక వీరుడు, దేశ‌భ‌క్తుడు, ఇంక్విలాబ్ జిందాబాద్‌ అంటూ రాఘవ్ చ‌ద్దా ట్వీట్ చేశారు. సిమ్రాన్‌జిత్ మాన్ వ్యాఖ్య‌ల‌ను పంజాబ్ మాజీ సీఎం సుఖ్‌జింద‌ర్ సింగ్ రాంధావా తీవ్రంగా ఖండించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన యువ కిశోరం భ‌గ‌త్‌సింగ్‌ను నేడు ఉగ్ర‌వాది అని పిలుస్తున్నార‌ని మండిప‌డ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే వారిని, దేశానికి వ్య‌తిరేకంగా పోరాడే వారిని విడ‌గొట్టి మాట్లాడ‌టం నేర్చుకోండని వ్యాఖ్యానించారు. ఈ ఎంపీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల ఇమేజ్‌ను తగ్గిస్తాడని తగ్గించేలా మాట్లాడారని సుఖ్జిందర్ సింగ్ మండిపడ్డారు.

  అయితే ఖలిస్తాన్ ఏర్పాటుకు సిమ్రన్ జిత్ సింగ్ మాన్ గట్టి మద్దతుదారు. పంజాబ్ లో ఆప్ విజయంతో సంగ్రూర్ ఎంపీగా ఉన్న భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా.. అనూహ్యంగా సిమ్రన్ జిత్ సింగ్ మాన్ విజయం సాధించారు. తన విజయాన్ని ఖలిస్థానీ మిలిటెంట్ జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలేకు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. కశ్మీర్‌లో భారత సైన్యం వేధింపుల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని అన్నారు. అయితే 1984లో స్వర్ణ దేవాలయంపై ఆపరేషన్ బ్లూస్టార్ ను నిరసిస్తూ మాన్ తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. నాటి నుంచి ప్రత్యేక ఖలిస్థాన్ కు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య కుట్ర కేసులో ఆయన ఐదేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించారు.

  Related Stories