డబ్బులు ఉన్నోళ్లకే టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్.. అందుకే ఓటమి అంటున్న కాంగ్రెస్ ఎంపీ

0
902

పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురవుతూ ఉంది. పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ ఫలితాలతో నిరాశ చెందిన లోక్‌సభ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. అంతర్గత పోరు, క్రమశిక్షణారాహిత్యం, నోట్లు ఇచ్చినోళ్లకు టిక్కెట్లు, కార్యకర్తలకు నిరాదరణ, నాయకుల అహంకారం కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ దారుణంగా దెబ్బతినిందని అన్నారు. ట్విటర్‌లో ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ టిక్కెట్ల కేటాయింపును సమీక్షించలేదని, యోగ్యత కలిగిన కాంగ్రెస్‌ నాయకులను విస్మరించి, డబ్బులు ఇచ్చిన వాళ్లకు టిక్కెట్లు ఇచ్చారని విమర్శలు చేశారు.

ఏఐసీసీ ఇన్‌చార్జి హరీష్ చౌదరి, జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్‌లు టిక్కెట్ల పంపిణీలో చాలా దారుణాలకు పాల్పడ్డారని ఆరోపించారు గిల్. రాష్ట్రంలో ‘నోట్లను జేబులో వేసుకున్నారని, ప్రతిపక్షం ఓట్లను తీసుకుందని’ అన్నారు. మూడు నెలల క్రితమే పంజాబ్‌లో కాంగ్రెస్ గెలుపొందడం ఖాయమని అనుకున్నామని, అయితే ఈ ఇద్దరు టిక్కెట్ల పంపిణీకి రంగంలోకి దిగడంతో రాష్ట్రంలో పార్టీ నాశనమైందని ఆయన అన్నారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 117 స్థానాలు ఉండగా వీటిలో ఏకంగా 91 స్థానాల్లో ఆప్ ఆధిక్యతలో ఉంది. గత ఎన్నికల్లో ఆప్ సాధించిన సీట్ల కంటే ఇది 71 స్థానాలు ఎక్కువ. మరోవైపు కాంగ్రెస్ 17 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. గతంలో సాధించిన సీట్ల కంటే కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో వెనుకబడి ఉంది. అకాళీ దళ్ 6, బీజేపీ 2 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. పంజాబ్ లో ఆప్ అఖండమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.