పంజాబ్లోని అమృత్సర్లోని మొబైల్ షాపులో పనిచేస్తున్న ఒక వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఇది ప్రమాదవశాత్తు చోటు చేసుకుంది. కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు కారణమైన పోలీసును సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. షాపులోని సీసీటీవీ ఫుటేజీలో పోలీసు జేబులోంచి పిస్టల్ తీసి కౌంటర్పై ఉంచడం కనిపించింది. ఈ సమయంలో అతని గన్ పేలి మొబైల్ షాపులో పనిచేస్తున్న బాధితుడి పైకి తూటా దూసుకుని వెళ్ళింది. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. “ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ప్రకారం అతడిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది” అని అమృత్సర్లోని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ACP) నార్త్ వారిందర్ సింగ్ తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో జమ్మూ కశ్మీర్లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి.. పోలీసు రైఫిల్ అనుకోకుండా ఫైర్ అవ్వడంతో ఒక పౌరుడు మరణించాడు. బాధితుడిని మహ్మద్ ఆసిఫ్ పద్రూగా గుర్తించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని అధికారులు తెలిపారు.