పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో వివాదాలు తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే..! ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తో మాజీ క్రికెటర్, ఎమ్మెల్యే నవజోత్ సింగ్ సిద్ధూ విభేదిస్తున్నారు. సీఎంపై ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అమరీందర్ సింగ్‌పై తిరుగుబాటు బావుటాను నవజోత్ సింగ్ సిద్ధూ ఎగురవేశారు. దీంతో సిద్ధూ కాంగ్రెస్ పార్టీని వీడబోతూ ఉన్నారనే ప్రచారం సాగుతూ ఉంది. అయితే నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాను కలిశారు. తనకు, సిద్ధూకు మధ్య ఎలాంటి సమావేశం జరగలేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పిన ఒక రోజు తర్వాత ప్రియాంక గాంధీతో క్రికెటర్ రాజకీయ నాయకుల సమావేశం జరిగింది. అమరీందర్ సింగ్‌తో కొనసాగుతున్న గొడవపై సిద్ధూను రాహుల్ శాంతిపజేయడానికి ప్రయత్నించినప్పటికీ అది వీలైనట్లు కనిపించలేదు.
మరోవైపు పంజాబ్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగుతుండడంతో.. పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముగ్గురు సీనియర్ నేతలతో ఒక ప్యానల్ ను ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ ప్యానల్ తో అమరీందర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. అయితే ప్యానల్ తో సిద్ధూ సమావేశం అవ్వలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రియాంకగాంధీతో తాను భేటీ అయిన ఫొటోను సిద్దూ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈరోజు ఉదయం ఆమెను కలిసినట్టు ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, తాను పోషించబోయే పాత్ర గురించి ప్రియాంకతో చర్చించానని ఆయన చెప్పారు.
ఇక నవజోత్ సింగ్ సిద్ధూపై శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర విమర్శలు చేశారు. సిద్ధూ లక్ష్యం లేని మిసైల్‌గా బాదల్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి పంజాబ్‌కు అవసరమని, నటించే నేతలతో ఉపయోగం లేదని సెటైర్లు వేశారు. అదుపులో లేని క్షిపణి వంటి సిద్ధూ ఏ దిశగానైనా వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు.