కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ వైపు ఖలిస్థాన్ తీవ్రవాదులకు బహిరంగంగా మద్దతు తెలుపుతూ ఉండగా.. మరో వైపు ఖలిస్థాన్ తీవ్రవాదులు రెచ్చిపోతూ ఉన్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నేతను కాల్చి చంపేశారు. దాలా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడిని అతని ఇంటి దగ్గరే కాల్చి చంపారు. చాలా దగ్గరకు వచ్చి తీవ్రవాదులు అతడిపై దాడి చేశారు.
‘నంబర్దార్’ అలియాస్ ‘బల్జీందర్ సింగ్ బల్లి’ అనే 45 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిపై రెండుసార్లు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ అతని ఛాతీలోకి దూసుకుని వెళ్లగా.. మరొకటి అతని తొడలోకి దూసుకుని వెళ్లిందని పోలీసులు తెలిపారు. బల్లి కాంగ్రెస్ పార్టీ అజిత్వాల్ గ్రామ బ్లాక్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇద్దరు దుండగులు మోటర్ బైక్‌పై వచ్చి బల్లిని హత్య చేసి పరారయ్యారు.
ఈ హత్య జరిగిన కొన్ని గంటలకు దీని వెనుక ఉన్నది తామేనని ఖలిస్థాన్ ఉగ్రవాదులు ప్రకటించారు. గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాది అర్ష్‌దీప్ సింగ్ గిల్ అకా అర్ష్ దల్లా స్పందిస్తూ.. బల్జీందర్‌ను హతమార్చింది తామేనని ఫేస్‌బుక్‌లో తెలిపాడు. బల్జీందర్ తన జీవితాన్ని నాశనం చేశాడని, గ్యాంగ్‌స్టర్ కల్చర్‌లోకి తనను బలవంతంగా నెట్టేశాడని ఆరోపించాడు. తన తల్లి పోలీసు కస్టడీ వెనక అతడి హస్తం ఉందని, ప్రతీకారంగానే అతడిని హత్య చేసినట్టు తెలిపాడు.జాతీయ భద్రతా సంస్థ వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో అర్ష్ దల్లా పేరు కూడా ఉంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా కెనడా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. పంజాబ్‌లో పలు హత్యల్లో అతడి ప్రమేయం ఉందని నమ్ముతారు. బల్లి వరండాలో నిల్చున్నప్పుడు నిందితుల్లో ఒకరు ఇంట్లోకి వచ్చాడు. ఇంతలో అతడిపై కాల్పులు జరిపి వెళ్ళిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాధితుడిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆలస్యమైంది. బుల్లెట్ గాయాలతో బల్లి మృతి చెందాడు.
ఈ ఘటనను పలువురు కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు హత్యలు, దోపిడీలు, భయంకరమైన నేరాలలో అర్ష్ దల్లా ప్రమేయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కనుగొన్న తర్వాత ఈ ఏడాది జనవరిలో అర్ష్ దల్లాను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇంతలో అర్ష్ దల్లా కాంగ్రెస్ నేత హత్యలో భాగమయ్యాడు.
ఇక సర్రేలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించిన రోజునే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కెనడా ఆరోపణలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. పార్లమెంటులో కెనడా ప్రధాని ప్రకటనను, అలాగే విదేశాంగ మంత్రి ప్రకటనను తాము తిరస్కరిస్తున్నామని.. కెనడాలో హింసాత్మక ఘటనలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు అసంబద్ధమైనవి, ప్రేరేపించినవని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.