More

    హిందువు అయినందుకే పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా తిరస్కరణ

    పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రెబల్స్ బెడద పట్టుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్ధి ప్రకటన ఆ పార్టీలోని అంతర్గత పోరును బయటపెట్టింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న కసరత్తు నుంచి తన పేరును తొలగించడానికి కారణం తాను హిందువును కావడమేనని ఆ పార్టీ నేత సునీల్ జక్కర్ ఆరోపించారు. ఓ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవికి సిక్కు నేత అయితే బాగుంటుందని ఢిల్లీలో కూర్చున్న సలహాదారులు తనకు చెప్పారన్నారు. పంజాబ్ లౌకికవాద రాష్ట్రమని గుర్తు చేశారు.

    ఢిల్లీలో కూర్చున్న సలహాదారులు అధిష్ఠానానికి సరైన సలహాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. తాను హిందువునైనందు వల్ల తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించబోమని చెప్పకుండా, తాను ఎమ్మెల్యేను కానందువల్ల, తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించడం లేదని చెబితే బాగుండేదన్నారు. ఎంపిక చేసిన దళిత నేత సరైనవాడనుకుంటే, ఆయనకు మద్దతును పార్టీ కొనసాగించాలన్నారు. శాసన సభ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ సాధ్యమైనంత త్వరగా నిర్ణయించాలని అన్నారు. ఇదిలావుండగా, అంతకుముందు ప్రచారం జరిగినట్లుగానే పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించలేదు.

    అయితే పంజాబ్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఈనెల 6న ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అదే తేదీన పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పలువురు నేతలు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీనే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

    మరోవైపు కెప్టెన్‌ అమరీందర్ సింగ్‌ కాంగ్రెస్‌ను వీడిన తర్వాత ఎమ్మెల్యేలందరూ తనకే మద్దతుగా ఉన్నారని ప్రకటించారు సునీల్‌ జాఖర్‌. పంజాబ్ ముఖ్యమంత్రి కావడానికి 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు ఓటు వేశారని వెల్లడించారు. ఇక సిద్ధూకు 6, చన్నీకి కేవలం ఇద్దరు మాత్రమే మద్దతిచ్చారని తెలిపారు. సుఖ్‌జిందర్ రంధావాకు 16 ఓట్లు, ప్రణీత్ కౌర్‌కు 12 ఓట్లు వచ్చాయన్నారు. అబోహర్‌ సమీపంలోని మౌజ్‌గఢ్‌లో జరిగిన ఓ సమావేశంలో సునీల్ జాఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

    Trending Stories

    Related Stories