National

మోదీని కలిసిన పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కలుసుకున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో శుక్రవారం నాడు ఈ భేటీ జరిగింది. తాను ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి ప్రధానిని కలుస్తున్నందుకు గుర్తుగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయ జ్ణాపికను ప్రధానికి చన్నీ అందజేశారు. అనంతరం వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన సహా పంజాబ్‌కు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించినట్లు సీఎం చన్నీ తెలిపారు. చన్నీ మీడియాతో మాట్లాడుతూ రైతులతో సంప్రదింపులు జరిపి ఆందోళన పరిష్కరించాల్సిందిగా ప్రధానమంత్రిని కోరానని తెలిపారు. అలాగే కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశానని అన్నారు.

పంజాబ్ సంక్షోభం:

మంగళవారం నాడు ఊహించని విధంగా పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు సిద్ధూ అయితే కాంగ్రెస్ అధిష్టానం సమస్యను మీరే తేల్చుకోవాలని సూచించడంతో సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీతో సిద్ధూ భేటీ అ‍య్యారు. వీరిద్దరి మధ్య సుదీర్ఘ సమావేశం జరగ్గా, సిద్ధూ డిమాండ్లను సీఎం చన్నీ అంగీకరించినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మట్లాడుతూ.. పార్టీ, ప్రభుత్వం కలిసిమెలిసి పనిచేయాలని అన్నారు. నిజాయతీ, నమ్మదగిన అధికారులను నియమించాలని అన్నారు. పంజాబ్‌లో డీజీపీ, అడ్వొకేట్‌ జనరల్‌ నియామకంపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఒక నియామకాన్ని నిలిపివేస్తామని సీఎం చన్నీ హామీ ఇవ్వడంతో సిద్ధూ రాజీ పడినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఇరువురూ భావించారు. ఈ కమిటీలో ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతోపాటు ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధి ఒకరు సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా తొలుత కమిటీలో చర్చిస్తారు. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తారు.

కొత్త పార్టీని పెట్టే యోచనలో అమ‌రీంద‌ర్ సింగ్

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ కొత్త పార్టీని పెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు వచ్చాయి. అమ‌రీంద‌ర్ త‌న పార్టీకి పంజాబ్ వికాస్ పార్టీ అని పేరును ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి అమిత్ షాను క‌లిశారు. దీంతో ఆయ‌న బీజేపీలో చేర‌బోయే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్త‌లు వ్యాపించాయి. ఆ వార్త‌ల‌ను అమ‌రీంద‌ర్ కొట్టిపారేశారు. బీజేపీలో చేర‌డం లేద‌ని, అలాగే కాంగ్రెస్‌లో కొన‌సాగ‌డం లేద‌న్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven − five =

Back to top button