పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆసుపత్రిలో చేరారు. కడుపు నొప్పి కారణంగా బుధవారం రాత్రి నుంచి ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు కడుపులో ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. ముఖ్యమంత్రి మాన్ అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారని సంబంధిత వర్గాలు వార్తా సంస్థ ANIకి తెలిపాయి. వైద్యులు ఆయనకి ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారించారని వార్తా సంస్థ ANI నివేదించింది.
సిద్ధూ మూస్ వాలా హత్యకు సంబంధించి ఇద్దరు అనుమానితులను కాల్చి చంపిన తర్వాత రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ విజయవంతంగా అమలు చేసినందుకు పోలీసులను, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను బుధవారం మన్ అభినందించారు. హతమైన గ్యాంగ్‌స్టర్లను జగ్రూప్ సింగ్ రూప, మన్‌ప్రీత్ సింగ్‌లుగా గుర్తించారు. వీరి నుండి ఒక ఏకె 47, ఒక పిస్టల్‌ను ఎన్‌కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో.. రాష్ట్రంలోని గ్యాంగ్‌స్టర్‌లు, సంఘవ్యతిరేక శక్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రారంభించిందని తెలిపారు.