Telugu States

పుంగనూరు జాతి ఆవును లక్షలు వెచ్చించి కొన్న యోగా గురువు బాబా రాందేవ్

పుంగనూరు జాతి ఆవుకు కళ్లు చెదిరే ధర పలికింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ పశుపోషకుడి దగ్గరున్న ఆవు ఏకంగా రూ. 4.10 లక్షలకు అమ్ముడుపోయింది. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఈ గోవును కొనుగోలు చేశారు. మూడున్నర సంవత్సరాల వయసున్న ఈ ఆవు ఎత్తు 30 అంగుళాలు మాత్రమే. హరిద్వార్‌లోని బాబా రాందేవ్ ఆశ్రమం నుంచి తెనాలి వచ్చిన ప్రతినిధులు పశుపోషకుడు కంచర్ల శివకుమార్‌ను కలిసి ఆవును కొనుగోలు చేశారు. పశువైద్యాధికారి నాగిరెడ్డి వద్ద పరీక్షలు చేయించి దానిని వారు తీసుకెళ్లారు.

ఈ ఆవులు పాలు తక్కువగా ఇస్తాయని.. రైతులు పెంచుకొనేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే మిగతా ఆవుల పాలతో పోలిస్తే పుంగనూరు ఆవుల పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. పాలు రుచికరంగానూ ఉంటాయి. వీటిలో ఔషధ గుణాలు ఉంటాయనేది చాలా మంది నమ్మకం.

తెనాలికి చెందిన వ్యాపారి కంచర్ల శివకుమార్‌ మాట్లాడుతూ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ దీన్ని కొనుగోలు చేశారని అన్నారు. ఆ జాతి వీర్యం తెనాలి ప్రభుత్వ పశువైద్యశాలలో లభ్యమవుతోందని, తమ ఆవులకు ఇక్కడే వీర్య ఇంజక్షన్‌ చేయించినట్టు చెప్పారు. తమ వద్ద ఒంగోలు, పుంగనూరు, గిర్‌ తదితర జాతుల ఆవులు వంద వరకూ ఉన్నట్టు ఆయన తెలిపారు. పశువైద్యశాల సహాయ సంచాలకుడు బొంతు నాగిరెడ్డి మాట్లాడుతూ ఈ జాతి ఆవులకు చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రసిద్ధి చెందిందని, ఇవి ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు కలిగిన ఆవులని, వీటి పోషణకు చాలా తక్కువ స్థలం సరిపోతుందని అన్నారు.

Related Articles

Back to top button