కశ్మీర్ డివిజన్‌లోని పుల్వామాలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ ఉమ్మడి నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడి తెగబడ్డారు. పుల్వామా జిల్లా పింగ్లానాలో సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులు సంయుక్త బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఓ పోలీస్ వీరమరణం చెందగా.. ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌కు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భద్రతా దళాలు, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాదిని హతమార్చాయి. మృతుడి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని నౌపోరాకు చెందిన నసీర్ అహ్మద్ భట్‌గా పోలీసులు గుర్తించారు. అహ్మద్ భట్ అనేక ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడని, ఇటీవలనే ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నాడని కశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్‌కుమార్ తెలిపారు. ఉగ్రవాదుల గురించి పక్కాగా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్‌ను ప్రారంభించాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సోదాలు నిర్వహిస్తుండగా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరుపగా ఎన్ కౌంటర్ జరిగింది.