పీటీ ఉష.. ప్రపంచం మెచ్చిన అథ్లెట్. భారతదేశం పేరును ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేసింది. ఆమె క్రీడలలో భారతదేశానికి చేసిన సేవకు ఇటీవల బీజేపీ రాజ్యసభ సీటును ఇచ్చింది. అయితే ఆమె బీజేపీకి దగ్గరవ్వడం కొందరికి నచ్చలేదు. ఇప్పుడు ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
కోజికోడ్ జిల్లాలోని తన అకాడమీ క్యాంపస్‌లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, భద్రతకు ముప్పు వాటిల్లేలా అపరిచిత వ్యక్తులు అక్రమంగా చొరబడుతున్నారని ఆరోపిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష శనివారం మీడియా ముందు బాధపడ్డారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్‌లో గత కొంతకాలంగా ఇలాంటి వేధింపులు, భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని, తాను రాజ్యసభ సభ్యురాలు అయిన తర్వాత అది మరింత తీవ్రమైందని అన్నారు. జూలై 2022లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ద్వారా ఉష ఎగువ సభకు నామినేట్ అయ్యారు.
కోజికోడ్ సమీపంలో ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ ను 2002లో స్థాపించింది. స్కూల్ కు కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టారు. ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదని.. బీజేపీ తనను రాజ్యసభ కు నామినేట్ చేసిన తర్వాత కొందరు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కేరళ సీఎంను ఉష కోరింది. ఈ అకాడమీ ద్వారా దేశవ్యాప్తంగా వేలాదిమందికి అథ్లెటిక్స్ లో శిక్షణ ఇస్తున్నారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను ఈ సమస్యపై జోక్యం చేసుకుని, క్యాంపస్‌లోకి ఆరోపించిన ఆక్రమణలు, అతిక్రమణలను అరికట్టాలని అన్నారు. ఇక మహిళా అథ్లెట్లకు భద్రత కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఉషా పాఠశాలల్లో 25 మంది మహిళా అథ్లెట్లు ఉండగా, వారిలో 11 మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారు. వారి భద్రత మా బాధ్యత, ఈ విషయమై ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. క్యాంపస్‌లో పెద్ద ఎత్తున వ్యర్థపదార్థాలు పారబోస్తున్నారని, డ్రగ్స్ మాఫియా నుంచి కూడా ముప్పు పొంచి ఉందని ఆరోపించారు. కాంపౌండ్ వాల్‌ను నిర్మించేందుకు అకాడమీ యాజమాన్యాన్ని స్థానిక పంచాయతీ అనుమతించడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు ఉష. క్యాంపస్ మధ్యలో ఎవరో అక్రమ నిర్మాణం చేశారని, మేం అడిగితే దానికి పంచాయతీ అధికారుల ఆమోదం ఉందని చెప్పారు. ఈ ఆక్రమణను ప్రశ్నించిన పాఠశాల యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించారని ఆమె తెలిపారు.